ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకం రెండో విడత నిధుల విడుదలకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చినట్లు సమాచారం. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే నిధులు విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల రెండో వారంలో లబ్ధిదారుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అయ్యే అవకాశం ఉంది.

తొలి విడతలో అర్హత ఉన్నప్పటికీ సాంకేతిక సమస్యలు, వివరాల్లో తప్పులు, కొత్తగా అడ్మిషన్లు వంటి కారణాలతో ప్రయోజనం పొందలేకపోయిన విద్యార్థులకు రెండో విడతలో ఆర్థిక సాయం అందనుంది. ముఖ్యంగా ఒకటో తరగతి, ఇంటర్ ఫస్టియర్‌లో కొత్తగా చేరిన విద్యార్థులతో పాటు వివరాల్లో మార్పులు, చేర్పులు ఉన్నవారిని కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది.

2.7 లక్షల మందికి ప్రయోజనం?

తొలి విడతలో వివిధ కారణాలతో సుమారు 2.5 లక్షల మందికి పైగా విద్యార్థులకు తల్లికి వందనం సాయం అందలేదని సమాచారం. రెండో విడతలో సుమారు 2.7 లక్షల నుంచి 3 లక్షల మంది వరకు లబ్ధి పొందే అవకాశం ఉందని అంచనా.

ఈ వివరాలు తప్పనిసరిగా చెక్ చేసుకోండి

రెండో విడతలో నగదు పొందాలంటే విద్యార్థి, తల్లి ఆధార్ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో లబ్ధిదారులు పరిశీలించుకోవాలి. ఆధార్ ఈ-కేవైసీ, బ్యాంకు ఖాతా, IFSC, ఆధార్ అనుసంధానం వంటి వివరాల్లో ఎలాంటి తప్పులు లేకుండా చూసుకోవాలి. విద్యార్థి చదువుతున్న పాఠశాల లేదా కాలేజీ వివరాలు కూడా సరిగ్గా నమోదై ఉండాలి.

డేటాలో ఏమైనా తప్పులు ఉంటే వాటిని సరిచేసిన తర్వాతే తుది జాబితాలో అర్హత లభించే అవకాశం ఉంటుంది.

తొలి విడతలో 64.76 లక్షల మందికి సాయం

ఈ విద్యా సంవత్సరంలో జూలై 22న ప్రభుత్వం తల్లికి వందనం తొలి విడత నిధులను విడుదల చేసింది. మొత్తం 64.76 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన ఆర్థిక సాయాన్ని వారి తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. ఇప్పుడు రెండో విడత నిధుల విడుదల కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

By Ramya