కృష్ణా జిల్లా ఘంటసాల మండలం చిట్టూర్పు గ్రామంలోని శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి దేవస్థాన ప్రాంగణంలో ఆదివారం మూడు జిల్లాల స్థాయి తాళం భజన పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా చిట్టూర్పు గ్రామస్తులు ఏటా తాళం భజన పోటీలను నిర్వహించడం అభినందనీయమన్నారు. దేవి శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఆధ్యాత్మిక భావాలను పెంపొందించేలా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం సంతోషకరమని పేర్కొన్నారు. పోటీల నిర్వాహకులను అభినందించారు.

కొడాలి పీఏసీఎస్ అధ్యక్షుడు గుత్తికొండ వరప్రసాద్ మాట్లాడుతూ.. ఈ నెల 11 నుంచి 19వ తేదీ వరకు మూడు జిల్లాల స్థాయిలో తాళం భజన, మురళీ కోలాటం, భగవద్గీత శ్లోకాల పఠన పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాలకు చెందిన ఔత్సాహికులు ఈ పోటీల్లో పాల్గొనే అవకాశం ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకుడు కనపర్తి శ్రీనివాస్, జనసేన నియోజకవర్గ నాయకుడు మండలి వెంకట్రామ్, కమిటీ సభ్యులు దాసరి సతీష్, యలవర్తి వంశీ, తలశిల కృష్ణ, బొల్లి సోమశేఖర్, దాసరి ధీరజ్, మల్లిపెద్ది ప్రవీణ్‌తో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *