
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవ నిర్వహించనున్న నేపథ్యంలో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 15 రాత్రి 9 గంటల నుంచి అక్టోబర్ 17 శనివారం ఉదయం 6 గంటల వరకు తిరుమలలోని రెండు ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలను నిషేధించింది. గరుడసేవకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తిరుమల యాత్రకు వచ్చే భక్తులు ఈ ఆంక్షలను గమనించి, టీటీడీకి సహకరించాలని సంస్థ ఛైర్మన్ బీఆర్ నాయుడు కోరారు.
తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. వేంకటేశ్వరస్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన గరుడవాహనసేవను శుక్రవారం సాయంత్రం 6:30 గంటలకు నిర్వహించనున్నారు. ఈ సేవను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివచ్చే అవకాశం ఉండటంతో టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది.
ఈ విషయాన్ని టీటీడీ పాలకమండలి ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. గరుడసేవకు భారీగా భక్తులు హాజరయ్యే నేపథ్యంలో వారి భద్రతకు ప్రాధాన్యమిస్తూ తిరుమలలోని రెండు ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించినట్లు తెలిపారు. భక్తులు ఈ నిబంధనలను పాటిస్తూ టీటీడీకి సహకరించాలని కోరారు.
తిరుమల శ్రీవారి భక్తుల భద్రత, సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని అక్టోబర్ 15 గురువారం రాత్రి 9 గంటల నుంచి అక్టోబర్ 17 శనివారం ఉదయం 6 గంటల వరకు తిరుమలకు ద్విచక్ర వాహనాల రాకపోకలను నిషేధించినట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. భక్తులు ఈ ఆంక్షలను గమనించి టీటీడీకి సహకరించాలని, ప్రశాంత వాతావరణంలో స్వామివారిని దర్శించుకోవాలని సూచించారు.
మరోవైపు, గరుడసేవకు తరలివచ్చే భక్తులు తిరుమలలో పార్కింగ్ సదుపాయాలు పరిమితంగా ఉన్న విషయాన్ని గుర్తించాలని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు విజ్ఞప్తి చేశారు. భక్తులు తమ వాహనాలను తిరుపతిలో ఏర్పాటు చేసిన నిర్దేశిత పార్కింగ్ ప్రదేశాల్లో నిలిపి, అక్కడి నుంచి ఆర్టీసీ బస్సుల్లో తిరుమలకు చేరుకోవాలని సూచించారు. భక్తుల భద్రత, సౌకర్యవంతమైన ప్రయాణం కోసం పోలీసు, రవాణా శాఖలు జారీ చేసే సూచనలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు భక్తులు భారీగా తరలివస్తున్న నేపథ్యంలో టీటీడీ, పోలీసు శాఖ సంయుక్తంగా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టాయి. ముఖ్యంగా రద్దీ సమయంలో చిన్నపిల్లలు, వృద్ధులు కుటుంబ సభ్యుల నుంచి తప్పిపోకుండా ఉండేందుకు మహిళా పోలీసు సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా చిన్నారులు, వృద్ధుల చేతులకు గుర్తింపు ట్యాగ్లను కడుతున్నారు.
ఈ ట్యాగ్ల సహాయంతో ఎవరైనా కుటుంబ సభ్యుల నుంచి తప్పిపోయినప్పుడు వారిని సులభంగా గుర్తించి, సురక్షితంగా తిరిగి కుటుంబ సభ్యుల వద్దకు చేర్చేందుకు అవకాశం ఉంటుంది. మరోవైపు, భక్తులు కూడా తమ పిల్లలు, వృద్ధుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో వారిని ఒంటరిగా వదిలిపెట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన గురువారం ఉదయం కల్పవృక్ష వాహనసేవ అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ మలయప్పస్వామివారు ఉభయదేవేరులైన శ్రీదేవి, భూదేవితో కలిసి బకాసుర వధ అలంకారంలో కల్పవృక్ష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. గజరాజుల ముందు నడక, మంగళవాయిద్యాల నాదం, భక్తుల భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ప్రబంధ పారాయణం మధ్య వాహనసేవ కన్నులపండువగా సాగింది. మార్గమంతా భక్తులు కర్పూర హారతులు సమర్పిస్తూ స్వామివారి అనుగ్రహాన్ని పొందారు.
కోరిన కోరికలు తీర్చే కల్పవృక్ష వాహనం
పురాణాల ప్రకారం, క్షీరసాగర మథన సమయంలో ఉద్భవించిన కల్పవృక్షం భక్తులు కోరిన ఫలాలను ప్రసాదించే దివ్య వృక్షంగా ప్రసిద్ధి చెందింది. అలాంటి కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామివారు దర్శనమివ్వడం శుభప్రదంగా భక్తులు భావిస్తారు. ఈ వాహనసేవ ఐహిక సుఖాలు, సకలాభీష్టాల సాధనకు ప్రతీకగా నిలుస్తుంది.
ఇక గురువారం రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు శ్రీ మలయప్పస్వామివారు ఉభయదేవేరులతో కలిసి సర్వభూపాల వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు.
