
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు టీటీడీ కీలక సూచన చేసింది. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో శ్రీవాణి దర్శన టికెట్ల కరెంట్ బుకింగ్‌ను రెండు రోజుల పాటు రద్దు చేసింది. అక్టోబర్ 3, శనివారం, అక్టోబర్ 4, ఆదివారం రోజుల్లో శ్రీవాణి కరెంట్ బుకింగ్ కౌంటర్ అందుబాటులో ఉండదని టీటీడీ వెల్లడించింది.
ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు కరెంట్ బుకింగ్ కోటాలో జారీ చేసే 500 శ్రీవాణి దర్శన టికెట్లతో పాటు, దాతల కోసం విడుదల చేసే మరో 300 టికెట్ల కోటాను కూడా ఈ రెండు రోజులకు రద్దు చేసినట్లు తెలిపింది. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ పేర్కొంది. భక్తులు విషయాన్ని గమనించి తమ ప్రయాణాన్ని తదనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని సూచించింది.
వరుస సెలవులు, పెరటాసి మాసం కారణంగా తిరుమలకు భక్తుల రాక పెరిగింది. దీంతో దర్శనం కోసం వేచి ఉండే సమయం కూడా పెరిగింది. క్యూలైన్లలో ఉన్న భక్తులకు టీటీడీ అన్నప్రసాదం, తాగునీరు, పాలు, కాఫీ, టీ, మజ్జిగ వంటి సౌకర్యాలను అందిస్తోంది. అవసరమైన వైద్య సేవలను కూడా అందుబాటులో ఉంచింది.
రద్దీ మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో భక్తులు పరిస్థితిని గమనించి తిరుమల యాత్రను ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. భక్తులు ఎక్కువ సమయం క్యూలైన్లలో వేచి ఉండాల్సి వచ్చే అవకాశం ఉన్నందున సంయమనం పాటించాలని కోరుతున్నారు. ఇప్పటికే అక్టోబర్ 1, 5 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా రద్దు చేసిన విషయం తెలిసిందే.
బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 12 నుంచి 20వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో టీటీడీ ఏర్పాట్లను ముమ్మరం చేసింది. తిరుపతిలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని టీటీడీ జేఈవో డా. ఏ. శరత్ అధికారులను ఆదేశించారు.
తిరుపతి జేఈవో (వైద్యం, విద్య) శ్రీ ప్రభల గోపినాథ్‌తో కలిసి ఆయన పలు శాఖల అధికారులతో వర్చువల్‌గా సమీక్ష నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుపతిలోని ప్రధాన ప్రాంతాల్లో ఆకర్షణీయమైన విద్యుత్ అలంకరణలు, ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని సూచించారు.
అలాగే పార్కింగ్ ప్రాంతాలు, హోల్డింగ్ పాయింట్ల వద్ద భక్తులకు తాగునీరు, మరుగుదొడ్లు, సమాచార ఫ్లెక్సీలు వంటి అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
