
విజయనగరం జిల్లాలో వైఎస్సార్‌సీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అనుచరులు కూడా పార్టీకి రాజీనామా చేశారు. అప్పలనాయుడు తన అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించిన అనంతరం, వైఎస్సార్‌సీపీని వీడుతున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా వైఎస్ జగన్ నాయకత్వంపై అప్పలనాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మజ్జి శ్రీనుకు తాను వియ్యంకుడిననే కారణంతోనే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని ఆరోపించారు. పార్టీ క్రమశిక్షణపై కూడా ప్రశ్నలు లేవనెత్తారు. మజ్జి శ్రీనుకు బంధువైన బొత్స సత్యనారాయణపై కూడా ఇదే నిబంధన వర్తిస్తుందా? అని ప్రశ్నించారు.
వైఎస్సార్‌సీపీలో అసలు క్రమశిక్షణ కమిటీ ఉందా అంటూ అప్పలనాయుడు ప్రశ్నించారు. గౌరవం లేని చోట తాను కొనసాగలేనని, తన అనుచరులు కూడా ఇకపై అక్కడ ఉండరని స్పష్టం చేశారు. జగన్‌ను నమ్ముకున్న వేలాది కుటుంబాలు నష్టపోయాయని ఆయన వ్యాఖ్యానించారు.
పార్టీని జగన్ ఒక లిమిటెడ్ కంపెనీలా మార్చేశారని అప్పలనాయుడు విమర్శించారు. గత ఎన్నికల సమయంలో టీడీపీ గెలిచే అవకాశాలను తక్కువగా అంచనా వేయడం, పార్టీ నేతల్లో నెలకొన్న అతివిశ్వాసం వైఎస్సార్‌సీపీ ఘోర పరాజయానికి కారణమయ్యాయని ఆయన ఆరోపించారు. కొందరు నేతలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ పార్టీని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు.
ఇటీవల విజయనగరం జిల్లాలో వైఎస్సార్‌సీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీను వైఎస్సార్‌సీపీని వీడి టీడీపీలో చేరారు. అనంతరం పలువురు జెడ్పీటీసీలు కూడా పార్టీకి రాజీనామా చేశారు.
మజ్జి శ్రీను పార్టీ మారిన తర్వాత బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బడ్డుకొండ అప్పలనాయుడు కూడా హాజరయ్యారు. అప్పట్లో మజ్జి శ్రీను పార్టీని వీడినా తాను మాత్రం వైఎస్సార్‌సీపీలోనే కొనసాగుతానని అప్పలనాయుడు ప్రకటించారు. అయితే తాజాగా తన అనుచరులతో సమావేశం నిర్వహించి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
