
డేటింగ్ యాప్ ద్వారా ఏర్పడిన పరిచయం వివాహం వరకు వెళ్లి, చివరకు వివాదంగా మారిన ఘటన తిరుపతిలో చోటుచేసుకుంది. పెళ్లికి ముందే ఆస్తులు, నగదు విషయంలో వేధింపులు ఎదురయ్యాయని ఆరోపిస్తూ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్న యువకుడిని.. కేసు ఉపసంహరించుకోవాలంటే రూ.3 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం.
తిరుపతికి చెందిన సైంటిస్ట్ వంశీకి హైదరాబాద్‌లోని ఓ ఇన్సూరెన్స్ సంస్థలో డిప్యూటీ మేనేజర్‌గా పనిచేస్తున్న నమ్రతతో డేటింగ్ యాప్ ద్వారా పరిచయం ఏర్పడింది. కొంతకాలం తర్వాత వీరిద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుని నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. అయితే పెళ్లికి ముందే ఆస్తులు, నగదు విషయమై ఇబ్బందులు ఎదురయ్యాయని వంశీ కుటుంబం ఆరోపించింది. దీంతో నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో నమ్రత వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో వంశీపై క్రైమ్ నంబర్ 984/2025 కింద కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు నోటీసులు జారీ చేయడంతో వంశీ ప్రస్తుతం తిరుపతిలోని పోస్టల్ కాలనీలో తన స్నేహితులతో కలిసి ఉంటున్నట్లు సమాచారం.
అయితే తన ఫోన్ నంబర్‌ను వంశీ బ్లాక్ చేయడంతో నమ్రత ఈ-మెయిల్స్ ద్వారా తనను సంప్రదిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని వంశీ ఆరోపించారు. తనపై నమోదైన కేసును వెనక్కి తీసుకోవాలంటే రూ.3 కోట్లు ఇవ్వాలని, లేదంటే చంపేస్తానని బెదిరించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో వంశీ తిరుపతి ఈస్ట్ పోలీసులను ఆశ్రయించి తనకు రక్షణ కల్పించాలని కోరారు. రూ.3 కోట్లు డిమాండ్ చేస్తూ తనను హత్య చేస్తానని బెదిరింపులు వస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. వంశీ ఫిర్యాదు మేరకు తిరుపతి ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
డేటింగ్ యాప్‌లో మొదలైన పరిచయం.. వివాహ నిర్ణయం.. నిశ్చితార్థం రద్దు.. పోలీస్ కేసులు.. ఈ-మెయిల్ ద్వారా బెదిరింపులు.. చివరకు రూ.3 కోట్ల డిమాండ్ వరకు వెళ్లిన ఈ వ్యవహారం తిరుపతిలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.

