
రాజకీయ పరిణామాల మధ్య విజయ డెయిరీ ఛైర్మన్ పదవికి చలసాని ఆంజనేయులు రాజీనామా చేశారు. ఆయన విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చేరగా.. ఆయన బెడ్ మీద నుంచే తన రాజీనామా లేఖను మంత్రి పార్థసారథికి అందజేశారు. టీడీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చలసాని అంటున్నారు. గురువారం రోజు ఆయన విజయ డెయిరీ ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విజయ డెయిరీ ఎపిసోడ్ చర్చనీయాంశంగా మారింది. కొద్దిరోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలకు పుల్‌స్టాప్ పడింది.. విజయ డెయిరీ ఛైర్మన్ పదవికి చలసాని ఆంజనేయులు రాజీనామా చేశారు. టీడీపీ అధిష్ఠానం నిర్ణయాన్ని గౌరవిస్తూ ఆయన పదవి నుంచి తప్పుకున్నారు. పార్టీ నిర్ణయం తనకు శిరోధార్యమన్నారు చలసాని ఆంజనేయులు . విజయ డెయిరీ ఛైర్మన్‌గా మరొకరికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతోనే చలసాని రాజీనామా చేశారని మంత్రి పార్థసారథి తెలిపారు. చలసాని తనకు పార్టీ ముఖ్యమని.. పదవులు కాదని తనతో చెప్పారన్నారు. చలసాని ఆంజనేయులు విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరగా.. ఆయన బెడ్‌పై నుంచే తన రాజీనామా లేఖను మంత్రి పార్థసారథికి ఇచ్చారు.
విజయ డెయిరీ ఛైర్మన్ పదవి విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకుందామని, నామినేషన్ వేయొద్దని టీడీపీ అధిష్టానం చలసాని ఆంజనేయులకు చెప్పింది. ఆయన నామినేషన్ దాఖలు చేయగా.. ఉపసంహరించుకోవాలని సూచించింది. ఆయన మాత్రం గురువారం ఉదయం వరకూ నామినేషన్ వెనక్కు తీసుకుంటానని చెప్పారు.. కానీ ఎన్నికల ప్రక్రియ ప్రకారం ఆంజనేయులు విజయ డెయిరీ ఛైర్మన్‌గా రెండు రోజుల క్రితం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీడీపీ అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా చలసాని నామినేషన్ వేయడం చర్చనీయాంశమైంది. ఏకంగా పార్టీ కావాలో, పదవి కావాలో తేల్చుకోవాలని ఆంజనేయులతో చెప్పినట్లు ప్రచారం జరిగింది. దీంతో చలసాని ఛైర్మన్ పదవిలో కొనసాగుతారా?.. పార్టీ ఆదేశాలను పాటిస్తారా అనే చర్చ జరిగింది.
విజయ డెయిరీ ఛైర్మన్‌గా ఎన్నికైన తర్వాత చలసాని ఆంజనేయులు, ఆయన కుమార్తెను మంత్రులు కొల్లు రవీంద్ర, పార్థసారథి కలిశారు. ఈ పదవి విషయంలో అధిష్టానం చెప్పినా వినలేదని.. పార్టీ కంటే ఎవరూ ముఖ్యం కాదని, పార్టీ నిర్ణయానికి అతీతంగా వెళ్లొద్దని సూచించారు. పార్టీ కావాలా, పదవి కావాలా అని నిర్ణయించుకోవాలని ఆయనతో చెప్పినట్లు తెలుస్తోంది. చలసాని తనకు ఒకరోజు సమయం కావాలని కోరినట్లు ప్రచారం జరిగింది. అయితే ఇంతలోనే చలసాని తన ఆరోగ్యం బాలేదని వెళ్లి విజయవాడలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. శుక్రవారం రోజు నాటకీయ పరిణామాల మధ్య చలసాని ఆంజనేయులు విజయ డెయిరీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఈ పదవిని మరొకరికి ఇచ్చే అవకాశం ఉందంటున్నారు.

