
తమిళనాడు అసెంబ్లీ ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అసెంబ్లీలో కావేరీ జలాల వివాదంపై సీఎం విజయ్‌ను విమర్శిస్తూ ప్రసంగించిన సందర్భంగా నటి త్రిషను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైంది. కేసు నమోదైన కొద్ది గంటల్లోనే చెన్నైలోని నివాసానికి చేరుకున్న పోలీసులు ఉదయనిధిని అదుపులోకి తీసుకున్నారు. ఇదే సమయంలో అరెస్టు నుంచి ఉపశమనం పొందేందుకు ముందస్తు బెయిల్ కోసం ఆయన మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై కోర్టు విచారణ జరపనుంది.
అసెంబ్లీలో కావేరీ జలాల సమస్యపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్న సమయంలో కొందరు సభ్యులు “త్రిష.. త్రిష” అంటూ నినాదాలు చేయగా, దానికి స్పందిస్తూ ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు డబుల్ మీనింగ్‌తో ఉన్నాయని తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ వ్యాఖ్యలు మహిళలను అవమానించేలా ఉన్నాయని రాజకీయ పార్టీలు, సినీ వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.
ఈ ఘటనపై టీవీకే, బీజేపీ తీవ్రంగా స్పందించాయి. టీవీకే నేత ఆథవ్ అర్జున్ ఉదయనిధి వెంటనే ప్రజలకు, నటి త్రిషకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ నాయకురాలు ఖుష్బూ సుందర్ కూడా బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరగా, తమిళనాడు బీజేపీ నాయకులు ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అయితే డీఎంకే మాత్రం తమ నాయకుడికి మద్దతుగా నిలిచింది. కావేరీ జలాల సమస్య, డెల్టా రైతుల ఇబ్బందుల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ వివాదాన్ని రాజకీయంగా పెద్దది చేస్తున్నారని పార్టీ నేతలు ఆరోపించారు. ఈ వ్యవహారం తమిళనాడు రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది.

