ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా శనివారం కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, కేంద్ర ఐటీ, రైల్వే శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశమయ్యారు. రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులు, నిధులు, రైల్వే మౌలిక వసతులపై చర్చించారు. అమిత్‌ షాతో సుమారు 40 నిమిషాల పాటు భేటీ కాగా, చర్చించిన అంశాలు వెల్లడికాలేదు.

కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశంలో ఏపీలో సెమీకండక్టర్‌ డిజైన్‌ రంగం అభివృద్ధికి సహకరించాలని చంద్రబాబు కోరారు. పరిశోధన, నైపుణ్య శిక్షణ, ఏఐ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం సహకరిస్తుందని మంత్రి హామీ ఇచ్చినట్లు సమాచారం.

రైల్వే ప్రాజెక్టులకు రూ.10,047 కోట్ల ప్రతిపాదనలు

రాష్ట్రంలో రైల్వే మౌలిక వసతుల విస్తరణకు రూ.10,047 కోట్లతో నాలుగు ప్రాజెక్టుల ప్రతిపాదనలను చంద్రబాబు సమర్పించారు. విజయవాడ బైపాస్‌, కొవ్వూరు-భద్రాచలం, ఒంగోలు-దొనకొండ, అనకాపల్లి-కొత్తవలస ప్రాజెక్టులను పరిశీలించాలని కోరారు. అమరావతి-విశాఖ మధ్య హైస్పీడ్‌ రైలు కారిడార్‌ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

విశాఖ నుంచి రెండు కొత్త రైళ్లు

విశాఖపట్నం నుంచి తిరుపతి మీదుగా బెంగళూరుకు వందేభారత్‌ స్లీపర్‌ రైలు, విశాఖ-తిరుపతి మధ్య పగటిపూట సీటింగ్‌ సౌకర్యంతో మరో రైలు నడపాలని చంద్రబాబు కోరారు. ఈ ప్రతిపాదనలకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. కనిగిరి-విజయవాడ మార్గంలో ప్రయాణికుల రైళ్లను ప్రారంభించాలని, పోర్టుల నుంచి సరకు రవాణాను సులభతరం చేయాలని, తూర్పు-పశ్చిమ రైల్వే అనుసంధానాన్ని బలోపేతం చేయాలని కూడా సీఎం ప్రతిపాదించారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *