
కర్నూలు జిల్లాలో 600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ప్లాంట్ అందుబాటులోకి వచ్చింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. జిల్లాలో 2,400 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ప్రాజెక్టు ద్వారా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రాలకు కూడా విద్యుత్‌ను సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు.
క్లీన్ ఎనర్జీ రంగంలో ఆంధ్రప్రదేశ్ మరోసారి కీలక పాత్ర పోషించేందుకు ఈ ప్రాజెక్టు నిదర్శనమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. కర్నూలులో ఏర్పాటు చేసిన ‘SAEL’ సోలార్ ప్లాంట్ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన రంగానికి ప్రాధాన్యమైన మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు.
‘చెప్పాం చేస్తున్నాం’ అంటూ సీఎం చంద్రబాబు ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రాజెక్టును పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చామని వెల్లడించారు.
