
అర్నబ్ తుఫాన్ ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మంత్రి అచ్చెన్నాయుడు జిల్లా అధికారులను అప్రమత్తం చేశారు. కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. ఇరిగేషన్, రెవెన్యూ, విద్యుత్ శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
తీర ప్రాంత గ్రామాల ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయాలని, నదీ పరివాహక ప్రాంతాల్లో నివసించే వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ప్రజలు చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగుల సమీపంలో ఉండరాదని మంత్రి సూచించారు. తుఫాన్ ప్రభావంతో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు.
ముందస్తు చర్యలతో ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించాలని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని తెలిపారు. అధికార యంత్రాంగం మొత్తం అందుబాటులో ఉండి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు.
