విశాఖలో తుఫాన్‌ ముప్పు నేపథ్యంలో ప్రజల భద్రతే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌ ప్రజలకు పలు కీలక సూచనలు చేశారు. తుఫాన్‌ ప్రభావం తగ్గే వరకు ప్రజలు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని అధికారులు జారీ చేసే సూచనలు హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.

మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని వాతావరణ పరిస్థితులు అనుకూలించే వరకు సముద్ర ప్రయాణాలకు దూరంగా ఉండాలని కలెక్టర్‌ సూచించారు. తీర గ్రామాలు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశిస్తే వెంటనే సహకరించాలని కోరారు. వరదనీటితో నిండిన రహదారులు, పొంగిపొర్లుతున్న వాగులు, డ్రైనేజీలను దాటేందుకు ప్రయత్నించవద్దని హెచ్చరించారు.

తెగిపడిన విద్యుత్‌ తీగలు, దెబ్బతిన్న విద్యుత్‌ పరికరాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రజలు ముందుగానే సిద్ధంగా ఉండాలని కలెక్టర్‌ సూచించారు. తాగునీరు, మందులు, నిత్యావసర వస్తువులు, ముఖ్యమైన పత్రాలను అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. రైతులు, పశువుల యజమానులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని పంటలు, పశువులు, వ్యవసాయ పరికరాల రక్షణకు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.

తుఫాన్‌ సమయంలో పుకార్లను నమ్మవద్దని వాటిని ఇతరులకు వ్యాప్తి చేయవద్దని అభిషిక్త్‌ కిశోర్‌ కోరారు. అధికారిక ప్రకటనలు వాతావరణ హెచ్చరికలను మాత్రమే విశ్వసించాలని స్పష్టం చేశారు. అత్యవసరం కాని ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని వ్యక్తిగత భద్రతతో పాటు కుటుంబ సభ్యుల రక్షణకు ప్రాధాన్యమివ్వాలని విజ్ఞప్తి చేశారు.

“మీ అప్రమత్తతే మీ కుటుంబానికి రక్షణ. అధికారుల సూచనలను నిర్లక్ష్యం చేయవద్దు. అత్యవసర పరిస్థితుల్లో సహకరించండి. మీ ప్రాణాలను కాపాడుకోవడంతో పాటు ఇతరుల ప్రాణాల రక్షణకు కూడా ప్రాధాన్యమివ్వండి” అని కలెక్టర్‌ ప్రజలకు పిలుపునిచ్చారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *