
ఉజ్జయిని మహంకాళి ఆలయంలో అధికారుల నిర్లక్ష్యంపై జోగిని శ్యామల ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరం వచ్చినప్పుడే జోగినిలను ప్రభుత్వం గుర్తు చేసుకుంటుందని ధ్వజమెత్తారు. బోనాల సందర్భంగా జోగినిలకు కనీస ఏర్పాట్లు కూడా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఆలయ సిబ్బంది జోగినిలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల అత్యుత్సాహం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని జోగిని శ్యామల ఆగ్రహించారు.
ఉదయం నుంచే గేట్ల వద్ద పోలీసులు జోగినిలను ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు. సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా జోగినిలను అవమానించారని దుయ్యబట్టారు. ఆలయ కమిటీ జోగినిలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసులు కనీసం జోగినిలని అని కూడా చూడకుండా బయటకు ఎందుకు నెట్టేశారని ప్రశ్నించారు. జోగినిలకు గౌరవం, ప్రత్యేక ఏర్పాట్లు కల్పించాలని ప్రభుత్వాన్ని జోగిని శ్యామల కోరారు.
ఉజ్జయిని మహంకాళి ఆలయం ముందు జోగినిలు ఈరోజు (సోమవారం) ధర్నా చేపట్టారు. నిన్న(ఆదివారం) బోనాల వేడుకల్లో జోగినిలను అవమానపరిచారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే జోగిని శ్యామలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు జోగినిలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బ్యారికేడ్లు తొలగించుకుని మహంకాళి ఆలయంలోకి జోగినిలు ప్రవేశించారు.
మహంకాళి ఆలయం ముందు జోగినిల ఆందోళనతో ఆలస్యంగా రంగం కార్యక్రమం ప్రారంభమైంది. జోగినిల ఆందోళనతో అమ్మవారి ఆలయం ముందు గందరగోళ వాతావరణం నెలకొంది. జోగినిలను చర్చలకు పిలిచి మంత్రి పొన్నం ప్రభాకర్, ఎండోమెంట్ ఉన్నతాధికారులు మాట్లాడుతున్నారు. ఆందోళనను విరమించాలని జోగినిలను మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.

