బీఆర్ఎస్ నేత, ఆ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ మరోసారి సోషల్ మీడియాలో ఆసక్తికరమైన పోస్టు చేశారు. తన ఇంటి వద్ద గత తొమ్మిది గంటలుగా ఇద్దరు పోలీసులు, మరికొందరు వ్యక్తులు నిఘా ఉంచినట్లు ఆయన ఆరోపించారు.

తాను ఇంట్లోనే ఉంటూ గల్లీ క్రికెట్ ఆడుకుంటున్నానని పేర్కొన్న క్రిశాంక్.. తన కోసం పోలీసులు తమ సమయం, శ్రమను వృథా చేసుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఈ మేరకు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఆయన.. తన ఇంటి వద్ద కొనసాగుతున్న పోలీసుల నిఘాపై వివరణ ఇవ్వాలని కోరారు.

బీఆర్ఎస్ నేత, ఆ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. ప్రభుత్వ విధానాలపై తరచూ ప్రశ్నలు సంధిస్తూ.. తనదైన శైలిలో కౌంటర్లు ఇస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఓ ఆసక్తికరమైన పోస్టు చేశారు.

తాను ఇంటికే పరిమితమై గల్లీ క్రికెట్ ఆడుకుంటున్నప్పటికీ.. తన కోసం ఇద్దరు పోలీసులు తమ సమయం, శ్రమను వెచ్చిస్తున్నారని క్రిశాంక్ పేర్కొన్నారు. తన ఇంటిపై పోలీసుల నిఘా అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించిన ఆయన.. వారి శ్రమను వృథా చేయాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ మేరకు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ను ట్యాగ్ చేస్తూ పోస్టు చేసిన క్రిశాంక్.. తన ఇంటి వద్ద పోలీసుల నిఘాపై వివరణ ఇవ్వాలని కోరారు.

కాగా, ఇటీవల మన్నె క్రిశాంక్ ఇంటివద్ద హైడ్రామా చోటుచేసుకుంది. సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఓ ఘటనకు సంబంధించి తెలంగాణ పోలీసుల పనితీరును ప్రశ్నిస్తూ క్రిశాంక్ సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలపై నాంపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో భాగంగా సెప్టెంబర్ 18న పోలీసులు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే ఆయన నివాసానికి చేరుకుని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు.

ఈ క్రమంలో క్రిశాంక్ కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసుల తీరును తీవ్రంగా వ్యతిరేకించారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారని పోలీసులను ప్రశ్నించడంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తీవ్ర వాగ్వాదం అనంతరం పోలీసులు క్రిశాంక్‌ను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు కోరారు.

అయితే, పోలీసుల చర్యలను సవాల్ చేస్తూ క్రిశాంక్ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. నాంపల్లి పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో క్రిశాంక్‌ను వెంటనే అరెస్ట్ చేయవద్దని పోలీసులను ఆదేశించింది. కేసులో నమోదైన నేరాలకు మూడేళ్లలోపు శిక్ష పడే అవకాశం ఉన్నందున.. BNS సెక్షన్ 35(3) ప్రకారం ముందుగా నోటీసు జారీ చేసి విచారణ చేపట్టాలని స్పష్టం చేసింది. అదే సమయంలో పోలీసుల దర్యాప్తుకు క్రిశాంక్ పూర్తిగా సహకరించాలని ఆదేశించింది.

ఈ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ.. ప్రభుత్వం విపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించింది. అయితే, చట్టానికి అనుగుణంగానే చర్యలు తీసుకుంటున్నామని అధికార వర్గాలు స్పష్టం చేశాయి.