
PAN Card New Rules: మార్చి నెల ముగియడంతో ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరానికి శ్రీకారం చుడుతున్నాం. ఈ నేపథ్యంలో పలు ఆర్థిక మార్పులు అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా టాక్స్ పేయర్లు, బ్యాంక్ కస్టమర్లు ఈ మార్పులపై అవగాహన కలిగి ఉండటం అవసరం. బ్యాంక్ ఛార్జీలు, ఐటీఆర్ ఫైలింగ్, టోల్ ఫీజులు, క్రెడిట్ కార్డు నిబంధనలు వంటి అంశాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. వాటి వివరాలు ఇప్పుడు చూద్దాం.
Income Tax Changes: సాధారణంగా ప్రతి నెలలో కొన్ని కొత్త రూల్స్ అమల్లోకి వస్తుంటాయి. చాలా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు నెల మొదటి తేదీ నుంచే మార్పులను అమలు చేస్తాయి. ఇక మార్చి ముగియడంతో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుండటంతో మరింత కీలక మార్పులు రానున్నాయి. 2026 ఏప్రిల్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్, ఫైనాన్షియల్ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఇవి టాక్స్ పేయర్లు, బ్యాంక్ కస్టమర్లు, డెబిట్-క్రెడిట్ కార్డు వినియోగదారులు, డిజిటల్ పేమెంట్ యూజర్లు, వాహనదారులు ఇలా అందరిపై ప్రభావం చూపనున్నాయి. మరి ఆ మార్పులు ఏమిటో తెలుసుకుందాం.
అప్‌డేటెడ్ ఐటీఆర్: గతంలో ఫైల్ చేసిన ఐటీ రిటర్న్స్‌లో తప్పులు ఉంటే వాటిని సరిచేసుకోవడానికి లేదా తెలియజేయని ఆదాయాన్ని చూపిస్తూ మళ్లీ రిటర్న్ దాఖలు చేసేందుకు ఈ అవకాశం ఉపయోగపడుతుంది. అసెస్‌మెంట్ ఇయర్ ముగిసిన రెండేళ్లలోపు ఐటీఆర్-యూ ఫైల్ చేయవచ్చు. అయితే దీనికి అదనపు పన్ను, జరిమానాలు వర్తిస్తాయి. ఈ ప్రక్రియ ఏప్రిల్ 1 నుంచే ప్రారంభమవుతుంది.
పాన్ కార్డ్: 2026 మార్చి 31 వరకు పాన్ కార్డు కోసం అప్లై చేయడానికి ఆధార్ కార్డు మాత్రమే సరిపోతుండేది. కానీ ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. ఇకపై అదనపు పత్రాలు తప్పనిసరి. జనన ధృవీకరణ పత్రం, ఓటర్ ఐడీ, పదో తరగతి సర్టిఫికేట్ వంటి డాక్యుమెంట్లు అవసరం కావచ్చు.
ఎస్బీఐ క్రెడిట్ కార్డు: ఎస్బీఐ కార్డ్ రివార్డ్స్ పాయింట్ల వినియోగ విధానంలో మార్పులు చేసింది. నెలకు గరిష్టంగా 60,000 పాయింట్ల వరకు మాత్రమే రిడీమ్ చేసుకునేలా పరిమితి విధించింది. కొన్ని కార్డుల్లో క్యాష్‌బ్యాక్ సదుపాయాలు కూడా తగ్గించబడినాయి. ఈ మార్పులు ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి రానున్నాయి.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్: ఈ ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ కూడా పలు కీలక మార్పులు ప్రకటించింది. లోన్ వడ్డీ రేట్లు కొంత తగ్గించగా, ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లు పెంచింది. లాకర్ ఛార్జీలు కూడా పెంచింది. ఇవి ప్రాంతం, లాకర్ పరిమాణాన్ని బట్టి మారుతాయి. అలాగే యూపీఐ ద్వారా ఏటీఎం నగదు ఉపసంహరణపై పరిమితులు విధించింది. పరిమితి మించితే జరిమానా విధిస్తామని తెలిపింది. కొన్ని మార్పులు ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వస్తాయి.
ఫాస్టాగ్ ఫీజు పెంపు: నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరను సవరించింది. 2026 ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ఇంతకుముందు రూ. 3000గా ఉన్న ధరను రూ. 3075కు పెంచారు.
రూపే డెబిట్ కార్డు: రూపే ప్లాటినమ్ డెబిట్ కార్డు హోల్డర్లకు లాంజ్ యాక్సెస్ నిబంధనల్లో మార్పులు చేశారు. ఇకపై కేవలం కార్డు ఉండటం సరిపోదు. నిర్దిష్ట మొత్తంలో ఖర్చు చేసినప్పుడే ఎయిర్‌పోర్ట్, ట్రైన్ లాంజ్‌లకు ప్రవేశం కల్పిస్తారు.
ఏటీఎం ఛార్జీలు: పంజాబ్ నేషనల్ బ్యాంక్, బంధన్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వంటి బ్యాంకులు ఏటీఎం నగదు ఉపసంహరణ విధానాల్లో మార్పులు చేశాయి. ఇందులో ఫీజులు, పరిమితులు, ఆంక్షలు ఉన్నాయి. ఇవి ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
2 ఫ్యాక్టర్ అథెంటికేషన్: దేశంలో అన్ని డిజిటల్ లావాదేవీలకు 2-ఫ్యాక్టర్ అథెంటికేషన్ తప్పనిసరి చేయాలని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈ నిబంధన కూడా ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వస్తుంది.
ఇవేకాకుండా, ప్రతి నెల మాదిరిగానే ఏప్రిల్ 1న ఎల్‌పీజీ గ్యాస్, పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్, పీఎన్‌జీ, సీఎన్‌జీ ధరల్లో మార్పులు ఉండొచ్చు. పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం ఇకపై ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షించనుంది. అలాగే ఐటీఆర్ ఫైలింగ్ ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఐటీఆర్ ఫార్మ్స్‌ను నోటిఫై చేసింది. కొత్త ఆదాయపు పన్ను చట్టం కూడా ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది.

