
హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి జీహెచ్‌ఎంసీ మరో కీలక ఫ్లైఓవర్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. మైలార్‌దేవ్‌పల్లి-కాటేదాన్ జంక్షన్ల మీదుగా శంషాబాద్ చేరుకునేలా రూ.345 కోట్ల అంచనా వ్యయంతో 2.08 కిలోమీటర్ల పొడవున ఆరు లేన్ల గ్రేడ్ సెపరేటర్ నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే ప్రయాణికులతో పాటు ఓల్డ్ సిటీ ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోనున్నాయి.
హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మరో కీలక ఫ్లైఓవర్ ప్రాజెక్టును చేపట్టేందుకు వేగంగా కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా మైలార్‌దేవ్‌పల్లి-కాటేదాన్ జంక్షన్ల మీదుగా శంషాబాద్‌కు సులువుగా చేరుకునేలా సంబంధించి ఆరు నెలల క్రితమే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పరిపాలనా అనుమతుల కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు. ఈ ప్రాజెక్టును దాదాపు రూ.345 కోట్ల అంచనా వ్యయంతో 2.08 కిలోమీటర్ల పొడవున నిర్మించాలని ప్రణాళిక సిద్ధం చేశారు.
నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటైన కాటేదాన్ జంక్షన్‌లో నిత్యం ఏర్పడుతున్న తీవ్రమైన ట్రాఫిక్ సమస్యను దృష్టిలో పెట్టుకుని ఈ గ్రేడ్ సెపరేటర్‌ను ప్రత్యేకంగా ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఓల్డ్ సిటీతో పాటు ఎల్బీనగర్, ఉప్పల్, కర్మన్‌ఘాట్ ప్రాంతాల ప్రజలు మైలార్‌దేవ్‌పల్లి, కాటేదాన్ మీదుగా ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ముఖ్యంగా శంషాబాద్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు వెళ్లే ప్రయాణికులకు ఈ ఫ్లైఓవర్ ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి పరిపాలనా అనుమతులు రాగానే వెంటనే టెండర్ ప్రక్రియను పూర్తి చేసి, వేగంగా పనులను ప్రారంభిస్తామని జీహెచ్‌ఎంసీ అధికారులు వెల్లడించారు.
కాగా, నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు హెచ్ఎండీఏ ఒక మెగా ప్రాజెక్ట్‌ను ప్రతిపాదించింది. బంజారాహిల్స్‌లోని జీవీకే మాల్ నుంచి మాసబ్ ట్యాంక్ మీదుగా మెహిదీపట్నంలోని పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే వరకు సుమారు 3 నుండి 4 కిలోమీటర్ల మేర మరో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు. ముఖ్యంగా శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి సిగ్నల్స్ లేకుండా వేగవంతమైన ప్రయాణాన్ని అందించడంతో పాటు, మాసబ్ ట్యాంక్, బంజారాహిల్స్ ప్రాంతాలలో తీవ్రమైన ట్రాఫిక్ రద్దీని తగ్గించడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం. ఈ మార్గంలో వివిధ ప్రాంతాల రాకపోకల సౌలభ్యం కోసం పలు అప్, డౌన్ ర్యాంపులతో పాటు, మాసబ్ ట్యాంక్ వద్ద అండర్‌పాస్‌లను కూడా నిర్మించనున్నారు. త్వరలోనే డీపీఆర్ పూర్తి చేసి ప్రభుత్వ అనుమతితో పనులు ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు.

