అమరావతి, జులై 25: రైతుల‌ ప్రయోజనాలను ర‌క్షించేందుకు ఇరిగేష‌న్, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. ఈరోజు(శనివారం) గోదావ‌రి, కృష్ణా డెల్టాల‌ ఇరిగేషన్ సీఈలు, ఎస్ఈల‌తో మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గ‌తంలో ఎప్పుడూ లేని విధంగా సీలేరు జ‌లాల‌ను గోదావ‌రి డెల్టా ఖ‌రీఫ్ అవ‌స‌రాల కోసం వినియోగిస్తున్నామని ఈ సందర్భంగా నిమ్మల తెలిపారు. పుష్కర కాలువ, ఏలేరు వ్యవస్థ ద్వారా వచ్చే నీటిని తాగునీటి అవ‌స‌రాల‌కు, ఆరుత‌డి పంట‌ల‌కే వినియోగించాలని సూచించారు.

పుష్కర కాలువ, ఏలేరు వ్యవస్థ ద్వారా తూర్పుగోదావ‌రి, కాకినాడ, విశాఖ‌ జిల్లాల్లో సుమారు 55 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందించాల్సి ఉందని మంత్రి తెలిపారు. గోదావ‌రి డెల్టా ఆయ‌క‌ట్టు రైతులు సాగు కొన‌సాగించేందుకు, అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చంద్రబాబు సూచించినట్లు చెప్పారు. డెల్టాలో మెర‌క ప్రాంత రైతులు ఆరుతుడి పంట‌ల‌కే ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా, శాస్త్రీయ పద్ధతిలో వినియోగించి ప్రతి నీటి బొట్టునూ స‌ద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

గోదావ‌రి సెంట్రల్, ఈస్టర్న్, వెస్టర్న్ డెల్టాల‌ ప్రాధాన కాలువ‌ల్లో నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా చూడాలని మంత్రి ఆదేశించారు. ఖ‌రీఫ్ పంట పూర్తయ్యే వ‌ర‌కు ఓఅండ్ఎం ప‌నులను కొన‌సాగిస్తూ.. రైతులు, సాగునీటి సంఘాల స‌హ‌కారంతో ఆయ‌క‌ట్టుకు సాగునీటిని అందించాలన్నారు. పోల‌వ‌రం కుడి ప్రధాన కాలువ ద్వారా వ‌చ్చే నీటిని దుర్వినియోగం కాకుండా, కృష్ణా డెల్టాకు అందేలా అధికారులు చర్యలు చేప‌ట్టాలని ఆదేశించారు. గోదావ‌రి, కృష్ణా డెల్టాల్లోని 10 జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో ఇరిగేష‌న్ అడ్వైజ‌రీ బోర్డ్ మీటింగ్‌లు నిర్వహించి ప్రస్తుత పరిస్థితులపై రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాలని సూచించారు. ఎల్‌నినో క్లిష్ట స‌మ‌యంలో ఇరిగేష‌న్ శాఖలో పై స్థాయి నుంచి కింది స్థాయి అధికారుల వరకు అంద‌రూ అందుబాటులో ఉండేలా సెల‌వులు ర‌ద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

By Rajini