
దక్షిణాది చిత్ర పరిశ్రమలో మలయాళం, తెలుగు సినిమాల మేకింగ్ విధానాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయని తెలిసిందే. మలయాళ చిత్రాల్లో కథా సహజత్వానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే.. తెలుగు సినిమాల్లో భారీ స్థాయి, కమర్షియల్ ఎలిమెంట్స్‌కి అధిక ప్రాముఖ్యత ఉంటుంది. ఈ నేపథ్యంలో మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ చేసిన తాజా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాను ఎందుకు స్ట్రైట్ తెలుగు సినిమాలు చేయడం కష్టంగా భావిస్తున్నానో ఆయన వివరించారు.
ఇటీవల నిర్వహించిన ఓ ప్రెస్ మీట్‌లో టోవినో మాట్లాడుతూ.. “మలయాళంలో సాధారణంగా సినిమాలను చాలా వేగంగా పూర్తి చేస్తాం. ఒక సినిమాను సింగిల్ షెడ్యూల్‌లో పూర్తి చేయడం మాకు అలవాటు. కానీ తెలుగులో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ఒక సినిమా ప్రారంభమై పూర్తవ్వడానికి కనీసం ఏడాది సమయం పడుతుంది” అని తెలిపారు.
“నేను ఒకేసారి రెండు లేదా మూడు సినిమాలు చేయలేను. సాధారణంగా ఒక సినిమాకు గరిష్ఠంగా మూడు నెలల సమయం మాత్రమే కేటాయించగలను. దాని కంటే ఎక్కువకాలం ఒకే ప్రాజెక్టుపై పని చేయడం నాకు కష్టంగా ఉంటుంది. తెలుగులో ఒక సినిమా అంగీకరిస్తే, అదే సమయంలో మలయాళంలో మూడు మంచి అవకాశాలను కోల్పోవాల్సి వస్తుంది” అని చెప్పారు.
అదే సమయంలో, తెలుగు సినిమా మేకింగ్‌లో భారీ యాక్షన్ సన్నివేశాలు, పాటల చిత్రీకరణకు ఎక్కువ రోజులు అవసరమవుతాయని ఆయన పేర్కొన్నారు. కానీ మలయాళంలో చిన్న షెడ్యూల్స్‌తో సినిమాలను త్వరగా పూర్తి చేయగలగడం వల్ల ఎక్కువ ప్రాజెక్టుల్లో పాల్గొనే అవకాశం ఉంటుందని వివరించారు.
ప్రస్తుతం టోవినో చేసిన ఈ వ్యాఖ్యలు టాలీవుడ్ మేకింగ్ స్టైల్, వేగం, అలాగే మలయాళ నటుల ప్రాధాన్యతలపై కొత్త చర్చకు దారితీస్తున్నాయి.

