
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం 34 అజెండా అంశాలపై విస్తృతంగా చర్చించి పలు కీలక నిర్ణయాలను ఆమోదించింది. రెండు కొత్త ప్రైవేట్ యూనివర్సిటీల స్థాపనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు, అమరావతిలో నిర్మించనున్న క్వాంటమ్ వ్యాలీ ట్విన్ టవర్స్ ప్రాజెక్టును ఎల్ అండ్ టీ సంస్థకు అప్పగించేందుకు అనుమతి తెలిపింది. అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ యాక్ట్-2026, ఏపీ పీపీపీ పాలసీ-2026, పాదచారుల భద్రతా విధానం, అమరావతి అభివృద్ధి, విద్య, పరిశ్రమలు, చట్ట సంస్కరణలకు సంబంధించిన పలు ప్రతిపాదనలకు కూడా కేబినెట్ ఆమోదం లభించింది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో అభివృద్ధి, మౌలిక వసతులు, విద్య, పరిశ్రమలు, పరిపాలనా సంస్కరణలకు సంబంధించిన అంశాలపై సమగ్రంగా చర్చించారు. అనంతరం మొత్తం 34 ప్రతిపాదనలకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
రాజధాని అమరావతి అభివృద్ధి దిశగా మరో కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం, క్వాంటమ్ వ్యాలీ ట్విన్ టవర్స్ నిర్మాణానికి రూ.1,002.49 కోట్ల వ్యయాన్ని ఆమోదించింది. ఈ నిర్మాణ పనులను ప్రముఖ ఇంజినీరింగ్ సంస్థ ఎల్ అండ్ టీకి అప్పగించేందుకు అనుమతి మంజూరు చేసింది. అదేవిధంగా అసెంబ్లీ, హైకోర్టు ఐకానిక్ భవనాల డిజైన్ల పూర్తి కోసం అదనపు నిధుల విడుదలకు కూడా కేబినెట్ అంగీకారం తెలిపింది.
అమరావతి భూ కేటాయింపులపై మంత్రివర్గ ఉపసంఘం (జీఓఎం) చేసిన సిఫార్సులను కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. అలాగే ‘అమరావతి ఐ’ ప్రాజెక్టుకు రీ-టెండర్లు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది. రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ యాక్ట్-2026 ముసాయిదా, ఏపీ పీపీపీ పాలసీ-2026కు ఆమోదం తెలిపింది. పరిశ్రమల విస్తరణకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనతో పాటు, ప్రభుత్వ భూముల్లో మొబైల్ టవర్ల ఏర్పాటుకు అనుమతి, వాటికి రాయితీ ధరలో విద్యుత్ సరఫరా చేయడానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.

