
దేశంలో మౌలిక సదుపాయాల రంగానికి చెందిన ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు (ఇన్విట్లు) పబ్లిక్ ఇష్యూల ద్వారా భారీగా నిధులు సమీకరించేందుకు సిద్ధమవుతున్నాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి 4-5 ఇన్విట్లు ఐపీఓలకు రానున్నట్లు తెలుస్తోంది. వీటి ద్వారా మొత్తంగా సుమారు రూ.17,000 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. నిర్వహణలో ఉన్న ఆస్తులను విక్రయించడం, దీర్ఘకాలిక పెట్టుబడులను సమకూర్చుకోవడం కోసం మౌలిక సదుపాయాల సంస్థలు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నాయని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లు చెబుతున్నారు. 2022-23 నుంచి 2024-25 మధ్య ఇన్విట్లు ఈక్విటీ జారీ ద్వారా దాదాపు రూ.88,000 కోట్ల నిధులను సేకరించాయి.
ఐపీఓకు సిద్ధమవుతున్న సంస్థలు
బ్రూక్‌ఫీల్డ్ పెట్టుబడులు కలిగిన ఆల్టియస్ టెలికాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్.. ప్రైవేట్ ప్లేస్మెంట్ నుంచి పబ్లిక్ ఇన్విట్గా మారే ప్రక్రియలో భాగంగా రూ.6,000 కోట్ల ఐపీఓ కోసం సెబీకి ముసాయిదా పత్రాలను సమర్పించింది. మరోవైపు, వేర్‌హౌసింగ్, ఇండస్ట్రియల్ పార్కుల విభాగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎన్టీఆర్ ఇన్విట్ రూ.750 కోట్ల ఐపీఓకు సన్నాహాలు చేస్తోంది. దీనికి ఇన్వెస్టా కార్ప్ మద్దతు ఉంది. కేకేఆర్, ఆంటారియో టీచర్స్ పెన్షన్ ప్లాన్ అండదండలు ఉన్న వెర్టిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్ కూడా పబ్లిక్ ఇష్యూపై ఆసక్తి చూపుతోంది.
రూ.7.5 లక్షల కోట్లకు ఇన్విట్ మార్కెట్
గత మార్చిలో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) స్పాన్సర్షిప్ ఉన్న రాజ్‌మార్గ్ ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ రూ.6,000 కోట్ల ఐపీఓను విజయవంతంగా పూర్తి చేసింది. ప్రస్తుతం దేశీయ ఇన్విట్ మార్కెట్ విలువ సుమారు రూ.7.5 లక్షల కోట్లకు చేరినట్లు అంచనా.
లిస్టింగ్‌కు మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ
మరోవైపు, మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ కూడా రాబోయే 18 నెలల్లో పబ్లిక్ లిస్టింగ్‌కు రావాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వ్యాపార విస్తరణ, ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకునేందుకు అవసరమైన నిధులను సమీకరించనున్నట్లు కంపెనీ ఛైర్మన్ రాజేశ్ జెజూరికర్ వెల్లడించారు.




