గొడ్డలి పార్టీ కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలి: సీఎం చంద్రబాబు

Date:

టీడీపీ కేంద్ర కార్యాలయంలో యూనిట్ ఇన్‌ఛార్జిలకు శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరై.. ప్రభుత్వ పథకాలు, పార్టీ కార్యక్రమాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కార్యకర్తల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకే ఈ శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. పార్టీ సిద్ధాంతాలు, విధానాలను అర్థం చేసుకుని.. ప్రభుత్వం చేపడుతున్న మంచి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు.

ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయకపోతే.. ప్రతిపక్షాలు చేసే తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మే అవకాశం ఉంటుందని చంద్రబాబు అన్నారు. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్న రీతిలో.. ప్రతిపక్ష పార్టీ చేస్తున్న కుట్రలు, దుష్ప్రచారాలను ఎప్పటికప్పుడు సమర్థంగా తిప్పికొట్టాలని కార్యకర్తలకు సూచించారు.

డీఎస్సీ పరీక్షల నిర్వహణ విషయంలో ప్రతిపక్ష పార్టీ దుష్ప్రచారం చేసేందుకు ప్రయత్నించిందని సీఎం తెలిపారు. అయితే వాటికి దీటుగా సమాధానం ఇవ్వగలిగామని పేర్కొన్నారు. డీఎస్సీ పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరగలేదనే విషయాన్ని ప్రజలకు స్పష్టంగా వివరించగలిగామని అన్నారు. అందుకే ప్రతిపక్ష పార్టీ మినహా ఇతర పార్టీలకు చెందిన కొందరు నేతలు కూడా ఎలాంటి తప్పులు జరగలేదని బహిరంగంగా చెబుతున్నారని తెలిపారు.

డీఎస్సీ ద్వారా నియమితులైన ఉపాధ్యాయులే శనివారం ప్రతిపక్ష పార్టీ తీరును తప్పుపడుతూ ఆందోళన చేపట్టారని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టే మంచి పనులను ప్రజలకు వివరించగలిగితే.. ప్రతిపక్షాల కుట్రలను ప్రజలే అడ్డుకుంటారని అన్నారు. ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను చేపడితే ప్రజలు కూడా సహకరించి భాగస్వాములవుతారనడానికి భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవమే నిదర్శనమని చెప్పారు.

పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వెళ్తే చర్యలు

ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించి వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తే.. కుట్రలను ప్రజలే గుర్తించి తిప్పికొడతారని చంద్రబాబు అన్నారు. కర్నూలులో ప్రతిపక్ష పార్టీకి వ్యతిరేకంగా టీచర్లు చేపట్టిన ఆందోళన ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఇటీవలే ప్రోగ్రెస్ రిపోర్ట్‌ను ప్రజల ముందు ఉంచానని సీఎం తెలిపారు. రాష్ట్రం ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ.. వ్యవస్థలను తిరిగి గాడిలో పెట్టి సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని చెప్పారు.

సాధారణ కార్యకర్త నుంచి పార్టీ అగ్రనేత వరకు అందరికీ పార్టీనే అత్యంత ముఖ్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గంలో ఏం జరుగుతుందనే విషయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నానని తెలిపారు. కార్యకర్తలను పట్టించుకోని వారిపైనా, పార్టీ విధానాలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపైనా జీరో టాలరెన్స్ విధానం అమలు చేస్తామని స్పష్టం చేశారు.

ప్రతిపక్ష పార్టీ రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం లేదని చంద్రబాబు అన్నారు. భవిష్యత్తులో ఎలాంటి ఎన్నికలు జరిగినా ప్రతి బూత్‌లో గత ఎన్నికల కంటే ఎక్కువ ఓట్లు సాధించేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ అధికారి, ప్రజాప్రతినిధి, పార్టీ నాయకుడి ప్రవర్తన ఓటర్లపై గణనీయమైన ప్రభావం చూపుతుందని తెలిపారు.

యూనిట్, క్లస్టర్ ఇన్‌ఛార్జిలు, మండల అధ్యక్షులకు తగిన గౌరవం దక్కేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...