జుట్టు ఆరోగ్యంగా, బలంగా ఉండాలంటే కేవలం నూనె రాయడం, షాంపూ చేయడం మాత్రమే సరిపోదు. రోజువారీగా మనం చేసే కొన్ని చిన్నచిన్న పొరపాట్లు జుట్టు ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. ముఖ్యంగా జుట్టును గట్టిగా దువ్వడం, తడిగా ఉన్నప్పుడే దువ్వడం, అతిగా వేడి నీటితో తలస్నానం చేయడం, తరచూ హీట్ స్టైలింగ్ చేయడం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. జుట్టు రకానికి తగిన ఉత్పత్తులను ఉపయోగిస్తూ, తలకు పరిశుభ్రతతో పాటు సరైన పోషకాహారం, తగినంత నిద్ర, ఒత్తిడి నియంత్రణపై కూడా శ్రద్ధ పెట్టడం అవసరం.

జుట్టుకు నూనె రాయడం మన సంప్రదాయ కేశ సంరక్షణలో భాగం. నూనె రాయడం వల్ల జుట్టు పొడిబారకుండా, మృదువుగా ఉండటానికి సహాయపడటంతో పాటు.. తలస్నానం సమయంలో వెంట్రుకల మధ్య రాపిడిని కొంత తగ్గించవచ్చు. అయితే, ఏ నూనె వాడుతున్నామన్నదే కాకుండా.. దాన్ని ఎలా, ఎంత మోతాదులో అప్లై చేస్తున్నామన్నది కూడా ముఖ్యమే. జుట్టుకు నూనె రాసేటప్పుడు చేసే కొన్ని పొరపాట్లు జుట్టు తెగిపోవడం, మాడు జిడ్డుగా మారడం వంటి సమస్యలకు కారణం కావచ్చు.
చిక్కులు తీయకుండా నూనె రాయడం:
జుట్టులో చిక్కులు ఉన్నప్పుడు నేరుగా నూనె రాయడం లేదా బలంగా దువ్వడం వల్ల వెంట్రుకలు తెగిపోయే అవకాశం ఉంటుంది. అందుకే నూనె రాసే ముందు జుట్టును మెల్లగా దువ్వి చిక్కులను తొలగించుకోవడం మంచిది. ముందుగా జుట్టు చివర్ల నుంచి చిక్కులు తీస్తూ క్రమంగా పైకి రావాలి. గట్టిగా ఉన్న చిక్కులపై దువ్వెనను బలవంతంగా లాగకూడదు.
మాడుపై గట్టిగా రుద్దడం:
నూనె బాగా పనిచేయాలనే ఉద్దేశంతో మాడును ఎక్కువ ఒత్తిడితో లేదా ఎక్కువసేపు రుద్దడం అవసరం లేదు. ఇలా చేయడం వల్ల స్కాల్ప్‌కు చికాకు కలగవచ్చు. నూనెను మాడుపై వేర్వేరు ప్రాంతాల్లో కొద్దికొద్దిగా అప్లై చేసి, వేలికొనలతో మెల్లగా వృత్తాకారంలో మసాజ్ చేయడం మంచిది.
అవసరానికి మించి నూనె వాడటం:
జుట్టు మొత్తం నూనెతో తడిసిపోయేలా ఎక్కువగా రాసుకోవడం వల్ల అదనపు ప్రయోజనం ఉండదు. పైగా మాడు, జుట్టు జిడ్డుగా మరియు బరువుగా మారవచ్చు. ఆ జిడ్డును తొలగించేందుకు పదేపదే షాంపూ చేయాల్సి వస్తే జుట్టు పొడిబారే అవకాశం ఉంటుంది. కాబట్టి జుట్టు పొడవు, మందం, పొడిదనాన్ని బట్టి తగినంత పరిమాణంలోనే నూనె వాడాలి. మాడుకు అప్లై చేసిన తర్వాత చేతులకు మిగిలిన నూనెను జుట్టు పొడవునా, ముఖ్యంగా చివర్లకు మెల్లగా రాయవచ్చు.
రాత్రంతా నూనె ఉంచడం:
నూనె వల్ల ప్రయోజనం పొందడానికి తప్పనిసరిగా రాత్రంతా తలకు నూనె ఉంచాల్సిన అవసరం లేదు. తలస్నానానికి ముందు కొంత సమయం నూనెను ఉంచి తర్వాత శుభ్రం చేసుకోవచ్చు. ముఖ్యంగా మాడు జిడ్డుగా ఉండేవారు లేదా చుండ్రు, దురద వంటి సమస్యలు ఉన్నవారు ఎక్కువసేపు నూనె ఉంచే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నూనె రాసిన తర్వాత తగినంత సమయం ఉంచి, అవసరానికి అనుగుణంగా మైల్డ్ షాంపూతో తలస్నానం చేయడం మంచిది.
బాగా వేడిగా ఉన్న నూనె రాయడం:
నూనెను తప్పనిసరిగా వేడి చేయాల్సిన అవసరం లేదు. గోరువెచ్చని నూనెను ఉపయోగించాలనుకుంటే అది చర్మానికి సౌకర్యంగా ఉండేంత స్వల్పంగా మాత్రమే వేడిగా ఉండాలి. మరీ వేడిగా ఉన్న నూనెను నేరుగా స్కాల్ప్‌పై రాయడం వల్ల సున్నితమైన చర్మానికి కాలిన గాయం లేదా చికాకు కలిగే ప్రమాదం ఉంటుంది.
జుట్టుకు నూనె రాసే సరైన పద్ధతి:
ముందుగా జుట్టులోని చిక్కులను మెల్లగా తొలగించుకోవాలి. తర్వాత తగినంత పరిమాణంలో నూనె తీసుకుని మాడుపై వేర్వేరు భాగాల్లో కొద్దికొద్దిగా అప్లై చేయాలి. అనంతరం వేలికొనలతో మాడును మెల్లగా వృత్తాకారంలో మసాజ్ చేయాలి. చేతులకు మిగిలిన నూనెను జుట్టు పొడవునా, చివర్ల వరకు సున్నితంగా అప్లై చేయాలి. తగినంత సమయం తర్వాత అవసరాన్ని బట్టి మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి.
గమనిక:
ఇక్కడ అందించిన ఆరోగ్య, కేశ సంరక్షణ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ప్రతి ఒక్కరి జుట్టు, స్కాల్ప్ పరిస్థితి భిన్నంగా ఉంటుంది. చుండ్రు, తీవ్రమైన దురద, జుట్టు అధికంగా రాలడం లేదా ఇతర స్కాల్ప్ సమస్యలు ఉంటే స్వయంగా చికిత్స చేసుకోకుండా వైద్యుడు లేదా చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించడం మంచిది.
