
దేశీయ స్టాక్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి భారత కరెన్సీపై ప్రభావం చూపింది. అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ సోమవారం బలహీనపడింది. ఉదయం ట్రేడింగ్‌లో 23 పైసలు క్షీణించి 92.85 వద్ద కొనసాగింది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలపడటం, దేశీయ ఈక్విటీ మార్కెట్లలో నష్టాలు రూపాయిపై ఒత్తిడిని పెంచాయి.
ఐదు రోజుల లాభాలకు బ్రేక్
ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి ట్రేడింగ్ ప్రారంభంలో 93.47 స్థాయిని నమోదు చేసినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. అనంతరం 92.43 స్థాయికి చేరినప్పటికీ.. అమ్మకాల ఒత్తిడితో తిరిగి బలహీనపడింది. గత శుక్రవారం రూపాయి వరుసగా ఐదో సెషన్లోనూ లాభపడి డాలర్‌తో పోలిస్తే 92.62 వద్ద ముగిసింది. నవంబర్ 13న నమోదైన 94.19 స్థాయి నుంచి ఐదు సెషన్లలో 1.6 శాతానికి పైగా కోలుకుంది. అయితే సోమవారం డాలర్ బలపడటంతో ఆ లాభాల్లో కొంత భాగాన్ని కోల్పోయింది.
చమురు ధరల తగ్గుదలతో కొంత ఊరట
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర 0.28 శాతం తగ్గి బ్యారెల్‌కు 92.38 డాలర్ల వద్ద ట్రేడయింది. డాలర్ ఇండెక్స్ కూడా 0.03 శాతం క్షీణించి 103.71 స్థాయికి చేరింది. చమురు ధరలు తగ్గడం తొలుత రూపాయికి కొంత మద్దతునిచ్చినప్పటికీ.. డాలర్ బలపడటంతో ఆ ప్రభావం ఎక్కువసేపు కొనసాగలేదు.
నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
మరోవైపు దేశీయ ఈక్విటీ మార్కెట్లలోనూ అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ప్రారంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 408.3 పాయింట్లు తగ్గి 83,511.41 వద్దకు చేరింది. నిఫ్టీ 118.90 పాయింట్లు కోల్పోయి 25,684.30 వద్ద ట్రేడయింది. అయితే గత శుక్రవారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FII) నికరంగా రూ.10,308.42 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయడం గమనార్హం.
తగ్గిన విదేశీ మారక నిల్వలు
ఇదిలా ఉండగా, నవంబర్ 13తో ముగిసిన వారంలో దేశ విదేశీ మారక నిల్వలు 14.205 బిలియన్ డాలర్లు తగ్గి 705.342 బిలియన్ డాలర్లకు చేరినట్లు ఆర్బీఐ వెల్లడించింది. మరోవైపు అక్టోబర్‌లో దేశంలోని కీలక మౌలిక రంగాల ఉత్పత్తి 10.9 శాతం వృద్ధి చెందింది. బొగ్గు, ఇనుప ఖనిజం, విద్యుత్, సిమెంట్ రంగాల్లో రెండంకెల వృద్ధి నమోదవడం ఈ పెరుగుదలకు ప్రధాన కారణంగా నిలిచింది.




