తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో మున్సిపల్ డిప్యూటీ మేయర్, వైస్ ఛైర్మన్ పదవుల పంపకంపై కూటమి పార్టీల మధ్య ఎట్టకేలకు ఏకాభిప్రాయం కుదిరింది. ఆదివారం రాత్రి వరకు కొనసాగిన సుదీర్ఘ చర్చలు కొలిక్కి రావడంతో పదవుల కేటాయింపుపై స్పష్టత వచ్చింది.

ఇందులో భాగంగా చిత్తూరు డిప్యూటీ మేయర్‌తో పాటు కుప్పం, నగరి, పుత్తూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి మున్సిపల్ వైస్ ఛైర్మన్ పదవులను టీడీపీకి కేటాయించారు. తిరుపతి డిప్యూటీ మేయర్, పలమనేరు మున్సిపల్ వైస్ ఛైర్మన్ స్థానాలు జనసేనకు దక్కాయి. ఈ పదవులకు పాలడుగు విజయ, మురాదు పేర్లను అర్ధరాత్రి ప్రకటించారు.

నాయుడుపేట వైస్ ఛైర్మన్ పదవిని బీజేపీకి కేటాయించారు. రెండు జిల్లాల్లో డిప్యూటీ మేయర్, వైస్ ఛైర్మన్ పదవులకు సోమవారం ఎన్నికలు జరగనుండగా పుత్తూరులో మాత్రం ఎన్నికను మంగళవారానికి వాయిదా వేశారు. టీడీపీ, బీజేపీ అభ్యర్థుల ఎంపికపై చివరి వరకు ఉత్కంఠ కొనసాగింది.

చిత్తూరు డిప్యూటీ మేయర్ పదవికి తీవ్ర పోటీ

చిత్తూరు డిప్యూటీ మేయర్ పదవిపై టీడీపీలో తీవ్ర పోటీ నెలకొంది. ఇప్పటికే మేయర్‌గా బలిజ సామాజికవర్గానికి చెందిన కఠారి హేమలత ఎన్నికయ్యారు. దీంతో డిప్యూటీ మేయర్ పదవిని తమకు కేటాయించాలని పలు సామాజికవర్గాలకు చెందిన నాయకులు ప్రయత్నిస్తున్నారు. కమ్మ సామాజికవర్గం నుంచి నరిగిపల్లి గోపి, వరుణ్, రెడ్డి సామాజికవర్గం నుంచి లోకేశ్‌రెడ్డి, తమిళ కోటా కింద నళిని తిరుకుమరన్, వన్యకుల క్షత్రియ బీసీ వర్గం నుంచి శంకర్ తదితరుల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.

వెంకటగిరిలో జంపాల ప్రకాష్ పేరు ప్రచారం

వెంకటగిరి మున్సిపల్ వైస్ ఛైర్మన్ పదవికి జంపాల ప్రకాష్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కూడా ఆశావహులు, పార్టీ కౌన్సిలర్లకు ఈ మేరకు సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. ఛైర్‌పర్సన్ పదవి జనరల్ మహిళకు రిజర్వు అయినప్పటికీ బీసీ వర్గానికి కేటాయించడంతో వైస్ ఛైర్మన్ పదవిని ఓసీ వర్గానికి ఇవ్వాలనే ఆలోచనలో భాగంగా బలిజ సామాజికవర్గానికి చెందిన ప్రకాష్ పేరును ఎమ్మెల్యే సిఫారసు చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

సూళ్లూరుపేటలో మేడా సాయినారాయణకు అవకాశాలు?

సూళ్లూరుపేట మున్సిపల్ ఛైర్‌పర్సన్ పదవి ఎస్సీ మహిళకు కేటాయించడంతో వైస్ ఛైర్మన్ పదవిని ఓసీ లేదా బీసీ వర్గాలకు చెందిన పురుషులకు ఇచ్చే అవకాశం ఉంది. ఈ పదవి కోసం ఆర్యవైశ్య వర్గం నుంచి అలవల శ్రీనివాసులు, బీసీ వర్గాల నుంచి మేడా సాయినారాయణ, చీమల రమణయ్య, బాలచంద్ర అలియాస్ ఏజీ కిషోర్ పోటీలో ఉన్నారు. వీరిలో మేడా సాయినారాయణ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

పుత్తూరులోనూ పలువురు ఆశావహులు

పుత్తూరు మున్సిపల్ ఛైర్మన్ పదవి బీసీ వర్గానికి కేటాయించడంతో వైస్ ఛైర్మన్ పదవిని ఓసీ లేదా ఎస్సీ వర్గాలకు ఇచ్చే అవకాశం ఉంది. ఈ పదవి కోసం కమ్మ సామాజికవర్గం నుంచి గాలి జీవరత్నం నాయుడు, బలిజ వర్గం నుంచి విక్కీ రాయల్, క్షత్రియ వర్గం నుంచి ప్రతాప్ రాజు, ఎస్సీ వర్గం నుంచి ఆనంద్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి.

కుప్పంలో మైనారిటీలకు అవకాశం?

కుప్పం మున్సిపల్ వైస్ ఛైర్మన్ పదవిని మైనారిటీ వర్గానికి కేటాయించాలని ఆశావహులు ప్రయత్నిస్తున్నారు. ఈ పదవి కోసం షకీన, అఖిల, సుల్తానా పేర్లు ప్రచారంలో ఉన్నాయి.

నగరిలో విజయ్‌భాస్కర్ పేరు ప్రముఖంగా

నగరి మున్సిపల్ వైస్ ఛైర్మన్ పదవికి మాజీ మున్సిపల్ ఛైర్మన్లు కేజే కుమార్, శాంతిల కుమారుడు విజయ్‌భాస్కర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అదే సమయంలో ఎస్సీ వర్గం నుంచి లత, పాలేగార్ వర్గం నుంచి అమ్ములు పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.

మొత్తంగా రెండు జిల్లాల్లో కూటమి పార్టీల మధ్య పదవుల పంపకం కొలిక్కి వచ్చినప్పటికీ కొన్ని మున్సిపాలిటీల్లో అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *