
ప్రజలకు మరింత మెరుగైన నాణ్యమైన ప్రభుత్వ సేవలు అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రభుత్వ శాఖల పనితీరును మెరుగుపరచడంతో పాటు పౌర సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు.
రియల్ టైమ్ గవర్నెన్స్‌లో భాగంగా సోమవారం రాష్ట్ర సచివాలయంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సాంఘిక సంక్షేమం, బీసీ సంక్షేమం, మైనారిటీ సంక్షేమం, ఆర్థిక, మున్సిపల్, ఇంధన శాఖలతో పాటు ఆర్టీజీఎస్ అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా ప్రజలకు అందుతున్న పౌర సేవలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. సేవల నాణ్యతను మరింత పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా కెపాసిటీ బిల్డింగ్ ద్వారా ఉద్యోగుల్లో పని సామర్థ్యాన్ని పెంపొందించాలని సూచించారు.
ప్రభుత్వం అందిస్తున్న సేవలపై ప్రజల్లో సానుకూల అభిప్రాయం ఏర్పడినప్పుడే మరింత మెరుగైన పాలన అందించడం సాధ్యమవుతుందని సీఎం పేర్కొన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి వారికి సకాలంలో సేవలు అందించేలా శాఖలు పనిచేయాలని తెలిపారు.
అలాగే ప్రభుత్వ శాఖల్లో పర్యవేక్షణ లోపాలను గుర్తించి సరిదిద్దుకోవాలని ఉన్నతాధికారులకు సూచించారు. పాలనలో జవాబుదారీతనం సమర్థత పెంచుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా ముందుకు సాగాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.




