
తెలంగాణలో మావోయిస్టుల లొంగుబాటు కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం తాజాగా మరో 214 మందికి నగదు రివార్డులు పంపిణీ చేసింది. లొంగిపోయిన మావోయిస్టులకు మొత్తం రూ.5.59 కోట్ల ఆర్థిక సాయం అందించింది. 2024 జనవరి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 824 మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి చేరినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
వీరిలో 755 మందికి రూ.22.31 కోట్లకు పైగా రివార్డులు మంజూరు చేయగా.. ఇప్పటివరకు 659 మందికి రూ.17.68 కోట్లకు పైగా నగదు చెల్లింపులు పూర్తయ్యాయి. లొంగిపోయిన వారికి ఆర్థిక సహాయంతోపాటు పునరావాస సదుపాయాలు కూడా కల్పిస్తున్నారు. నిమ్స్ ఆసుపత్రిలో ఉచిత వైద్య చికిత్స పొందేందుకు ఆరోగ్య రక్షణ కార్డులు అందించడంతోపాటు ఇళ్ల స్థలాలను కూడా కేటాయిస్తున్నారు.
కర్రెగుట్టల్లో ఆయుధాల డంపులు స్వాధీనం
మరోవైపు కర్రెగుట్టల్లో పోలీసులు కీలకంగా సోదాలు నిర్వహించారు. అక్కడ ఉన్న తొమ్మిది డంపుల నుంచి భారీ మొత్తంలో ఆయుధాలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రాంతంలో మందుపాతరల ముప్పును పూర్తిగా తొలగించిన తర్వాతే పర్యాటకులను అనుమతిస్తామని డీజీపీ స్పష్టం చేశారు.
ఇదే సందర్భంగా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు అగ్రనేత గణపతితో పాటు మరో ఇద్దరు సీనియర్ నాయకులు కూడా ఆయుధాలు విడిచిపెట్టి జనజీవన స్రవంతిలోకి రావాలని డీజీపీ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం అందిస్తున్న పునరావాస అవకాశాలను వినియోగించుకుని సాధారణ జీవితాన్ని ప్రారంభించాలని కోరారు.
తెలంగాణలో మావోయిస్టుల లొంగుబాట్లు కొనసాగుతున్నాయి. సాయుధ పోరాటానికి స్వస్తి పలికి జనజీవన స్రవంతిలోకి వచ్చిన 214 మంది మావోయిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5.59 కోట్ల నగదు రివార్డులను అందించింది. రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ ఆధ్వర్యంలో తాజాగా ఈ ప్రోత్సాహకాలను పంపిణీ చేశారు. ఇదే సందర్భంగా మావోయిస్టు అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతితో పాటు అజ్ఞాతంలో ఉన్న మరో ఇద్దరు సీనియర్ నేతలు కూడా ఆయుధాలు విడిచిపెట్టి లొంగిపోవాలని డీజీపీ విజ్ఞప్తి చేశారు. లొంగిపోయే వారికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
824 మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి..
ఆపరేషన్ కగార్ ప్రారంభమైన 2024 జనవరి 1 నుంచి ఇప్పటివరకు తెలంగాణలో మొత్తం 824 మంది మావోయిస్టులు ఆయుధాలు వీడి పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో 2024లో 49 మంది, 2025లో 509 మంది, 2026లో ఇప్పటివరకు 266 మంది సాధారణ జీవితంలోకి అడుగుపెట్టారు.
రాష్ట్రాల వారీగా చూస్తే.. తెలంగాణకు చెందిన మావోయిస్టులు 59 మంది ఉండగా, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారు 754 మంది, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు 9 మంది ఉన్నారు. మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరు లొంగిపోయారు.
755 మందికి రూ.22.31 కోట్ల రివార్డులు
మొత్తం 824 మంది లొంగిపోయిన వారిలో అర్హత కలిగిన 755 మందికి ప్రభుత్వం రూ.22.31 కోట్లకు పైగా నగదు రివార్డులను మంజూరు చేసింది. ఇందులో ఇప్పటివరకు 659 మందికి రూ.17.68 కోట్లకు పైగా చెల్లింపులు పూర్తయ్యాయి. మిగిలిన 96 మందికి ఆధార్, బ్యాంకు ఖాతాల వివరాలు అందిన వెంటనే నగదు పంపిణీ చేయనున్నారు.
తాజాగా 214 మందికి రూ.5.59 కోట్ల రివార్డులు అందించడం ద్వారా లొంగుబాటు, పునరావాస కార్యక్రమాలను ప్రభుత్వం మరింత వేగవంతం చేస్తోంది. అజ్ఞాత జీవితాన్ని వీడి సాధారణ జీవనంలోకి రావాలనుకునే వారికి అన్ని విధాలా సహకరిస్తామని పోలీసు శాఖ స్పష్టం చేసింది.
లొంగిపోయిన మావోయిస్టులకు నగదు ప్రోత్సాహకాలతో పాటు తెలంగాణ ప్రభుత్వం పలు పునరావాస ప్రయోజనాలను కూడా కల్పిస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణకు చెందిన 57 మందికి నిమ్స్ ఆసుపత్రిలో నగదు రహిత వైద్య సేవలు పొందేందుకు ‘ఆరోగ్య రక్షణ’ కార్డులను అందించారు. మరో ఇద్దరికి ఆధార్ కార్డులు జారీ అయిన తర్వాత ఆరోగ్య కార్డులు ఇవ్వనున్నారు.
ఇక రాష్ట్రానికి చెందిన మొత్తం 59 మంది లొంగిపోయిన మావోయిస్టుల్లో ఇప్పటికే 10 మందికి ఇళ్ల స్థలాలు కేటాయించారు. మిగిలిన 49 మందికి స్థలాలు కేటాయించే ప్రక్రియ కొనసాగుతోంది. ఇతర రాష్ట్రాలకు చెందిన 765 మంది మావోయిస్టులకు అదనపు పునరావాస ప్రయోజనాలు కల్పించే అంశంపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో తెలంగాణ అధికారులు సమన్వయం చేసుకుంటున్నారు.
కర్రెగుట్టల్లో భారీగా ఆయుధాలు స్వాధీనం
మరోవైపు ఈ ఏడాది మావోయిస్టుల నుంచి, తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టల ప్రాంతంలో గుర్తించిన తొమ్మిది డంపుల నుంచి పోలీసులు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 252 తుపాకులు, 359 బీజీఎల్ షెల్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. వీటిలో 48 ఏకే-47 రైఫిళ్లు, 37 ఇన్సాస్ రైఫిళ్లు, 37 ఎస్ఎల్ఆర్లు, నాలుగు ఎల్ఎంజీలు, 25 .303 రైఫిళ్లు ఉన్నాయి.
కర్రెగుట్టల్లో మందుపాతరల ముప్పు
కర్రెగుట్టల ప్రాంతంలో మావోయిస్టులు పెద్ద సంఖ్యలో వివిధ రకాల మందుపాతరలను ఏర్పాటు చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నట్లు డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ముఖ్యంగా ప్రెషర్ మైన్స్ ఎక్కడెక్కడ అమర్చారనే దానిపై స్పష్టమైన సమాచారం లేదని పేర్కొన్నారు. లొంగిపోయిన మావోయిస్టులను విచారించడం ద్వారా తొమ్మిది ఆయుధ డంపులను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈ ప్రాంతంలో మందుపాతరల ముప్పును పూర్తిగా తొలగించేందుకు పోలీసులు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
కర్రెగుట్టల ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నప్పటికీ.. అక్కడ మందుపాతరల ముప్పు పూర్తిగా తొలగే వరకు పర్యాటకులను అనుమతించలేమని డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. ప్రాంతంలోని మైన్స్‌ను పూర్తిస్థాయిలో గుర్తించి తొలగించడంతో పాటు అవసరమైన భద్రతా ఏర్పాట్లు పూర్తయిన తర్వాతే సందర్శకులకు అనుమతి కల్పిస్తామని తెలిపారు.
మరోవైపు తెలంగాణకు చెందిన మావోయిస్టు అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి (పొలిట్‌బ్యూరో, కేంద్ర కమిటీ సభ్యుడు)తో పాటు మరో ఇద్దరు సీనియర్ నేతలు ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నట్లు డీజీపీ వెల్లడించారు. వారంతా సాయుధ పోరాటానికి స్వస్తి పలికి జనజీవన స్రవంతిలోకి రావాలని విజ్ఞప్తి చేశారు.
లొంగిపోయే మావోయిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లొంగుబాటు, పునరావాస విధానం ప్రకారం అన్ని ప్రయోజనాలు కల్పిస్తామని డీజీపీ సీవీ ఆనంద్ భరోసా ఇచ్చారు. సాధారణ జీవితాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు.



