
ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ సముద్ర వాణిజ్యం, పారిశ్రామిక రంగం, పర్యాటకానికి ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వెల్లడించారు. ఈ దిశగా రాష్ట్రంలో అందుబాటులో ఉన్న అవకాశాలను వినియోగించుకుంటూ ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.
విశాఖపట్నంలోని నోవాటెల్ హోటల్‌లో ఇండియా ఫౌండేషన్, భారత విదేశాంగ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ‘ఏషియన్–ఇండియా మారిటైమ్ కాంక్లేవ్’ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాలు, సముద్ర వాణిజ్య రంగంలో ఏపీకి ఉన్న అవకాశాలపై ప్రసంగించారు.
ఇదే సందర్భంగా మంత్రి నారా లోకేశ్ విశాఖపట్నంలో థాయ్‌లాండ్ రాయబారి చవనార్ట్ థాంగుసుమ్ ఫంట్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో రెండు ప్రాంతాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, పర్యాటక రంగాల్లో పరస్పర సహకారానికి ఉన్న అవకాశాలపై చర్చించినట్లు తెలిపారు.
విశాఖపట్నంలోని నోవాటెల్ హోటల్‌లో ఇండియా ఫౌండేషన్, భారత విదేశాంగ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ‘ఏషియన్–ఇండియా మారిటైమ్ కాంక్లేవ్’ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి నారా లోకేశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ సముద్ర వాణిజ్యం, పారిశ్రామిక రంగం, పర్యాటకానికి ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. ముఖ్యంగా ఆగ్నేయాసియా దేశాలతో బలమైన, దీర్ఘకాలిక సముద్ర వాణిజ్య భాగస్వామ్యాలను ఏర్పాటు చేసుకోవాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు.
కొత్త పోర్టుల నిర్మాణానికి ప్రాధాన్యం
రాష్ట్రానికి ఉన్న 1,053 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని లోకేశ్ చెప్పారు. ఇందులో భాగంగా రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం, కాకినాడలో నాలుగు కొత్త పోర్టుల నిర్మాణ పనులను చేపడుతున్నట్లు వివరించారు. దుగరాజపట్నంలో రూ.30 వేల కోట్లతో భారీ షిప్‌బిల్డింగ్ క్లస్టర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఇటీవల విశాఖపట్నంలో రూ.7,500 కోట్ల విలువైన ఐదు మారిటైమ్ ఒప్పందాలు కూడా కుదిరాయని తెలిపారు.
విశాఖను గ్లోబల్ డిజిటల్ హబ్‌గా అభివృద్ధి
గూగుల్ ప్రకటించిన 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి, సముద్రగర్భ కేబుల్ వ్యవస్థల ఏర్పాటుతో విశాఖపట్నం అంతర్జాతీయ డిజిటల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) హబ్‌గా ఎదిగే అవకాశాలు ఉన్నాయని లోకేశ్ పేర్కొన్నారు. ఈ పెట్టుబడులు రాష్ట్రంలో సాంకేతిక రంగ అభివృద్ధికి దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
గ్రీన్ ఎనర్జీ ఎగుమతులపై దృష్టి
స్వచ్ఛ ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్‌కు అపారమైన అవకాశాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. సౌర, పవన విద్యుత్‌తో పాటు పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ఉత్పత్తిని విస్తరించనున్నట్లు చెప్పారు. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి, ఎగుమతుల్లోనూ ఆంధ్రప్రదేశ్‌ను కీలక కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని నారా లోకేశ్ స్పష్టం చేశారు.
ఏషియన్–ఇండియా మారిటైమ్ కాంక్లేవ్ నేపథ్యంలో థాయ్‌లాండ్ రాయబారి చవనార్ట్ థాంగుసుమ్ ఫంట్‌తో మంత్రి నారా లోకేశ్ విశాఖపట్నంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్, థాయ్‌లాండ్ మధ్య సాంస్కృతిక, పర్యాటక సంబంధాలను మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చించారు. ఇందులో భాగంగా పలు కీలక ప్రతిపాదనలను లోకేశ్ రాయబారి ముందుంచారు.
రాజధాని అమరావతిలో థాయ్ సాంస్కృతిక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, రాష్ట్రంలోని బౌద్ధ వారసత్వ ప్రాంతాల అభివృద్ధికి థాయ్‌లాండ్ సహకారం అందించాలని కోరారు. బోధ్‌గయ తరహాలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక బౌద్ధ పర్యాటక సర్క్యూట్‌ను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు.
అలాగే ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో బౌద్ధ అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు థాయ్‌లాండ్‌లోని ప్రముఖ విశ్వవిద్యాలయాలు భాగస్వామ్యం కావాలని ఆహ్వానించారు. దీనివల్ల విద్యా, సాంస్కృతిక రంగాల్లో ఇరు ప్రాంతాల మధ్య సంబంధాలు మరింత విస్తరించే అవకాశం ఉంటుందని వివరించారు.
మరోవైపు సముద్ర పర్యాటక అభివృద్ధిపైనా లోకేశ్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. విశాఖపట్నం నుంచి థాయ్‌లాండ్‌కు క్రూయిజ్ సేవలు ప్రారంభించే అవకాశాలను పరిశీలించాలని కోరారు. తీర ప్రాంత పర్యాటకాన్ని అభివృద్ధి చేయడం ద్వారా అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించవచ్చని తెలిపారు. మంత్రి ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలిస్తామని థాయ్‌లాండ్ రాయబారి హామీ ఇచ్చారు.



