దేశంలోని ప్రతి పౌరుడికి రూ.30 వేల చొప్పున సబ్సిడీ అందించనున్నట్లు సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ‘యూనివర్సల్ సబ్సిడీ ప్రోగ్రామ్‌-2026’ పేరుతో వైరల్ అవుతున్న సందేశంలో నిజం లేదని స్పష్టం చేసింది. ఈ తరహా సందేశాల్లో వచ్చే అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని ప్రజలకు హెచ్చరించింది. ఈ మేరకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ విభాగం ఎక్స్ వేదికగా వివరణ ఇచ్చింది.

వాట్సాప్‌లో వైరల్‌గా దరఖాస్తు ఫారమ్

‘యూనివర్సల్ సబ్సిడీ ప్రోగ్రామ్‌-2026’ పేరుతో ఎస్‌బీఐ లోగోను ఉపయోగించిన ఓ దరఖాస్తు ఫారమ్ వాట్సాప్‌లో విస్తృతంగా ప్రచారమవుతోంది. ఈ పథకం ద్వారా ప్రతి ఒక్కరికీ రూ.30 వేల సబ్సిడీ లభిస్తుందని, దరఖాస్తు గడువు ఈ ఏడాది చివరితో ముగుస్తుందని అందులో పేర్కొన్నారు. వెంటనే సబ్సిడీ పొందేందుకు ఫారమ్‌లోని లింకులను క్లిక్ చేయాలని సూచిస్తున్నారు.

అలాంటి పథకం ఏదీ లేదు

అయితే రూ.30 వేల సబ్సిడీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పథకాన్ని ప్రకటించలేదని PIB ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. వైరల్ సందేశం పూర్తిగా అవాస్తవమని వెల్లడించింది. ప్రజలు ఇలాంటి లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

గుర్తుతెలియని లింకుల ద్వారా వ్యక్తిగత సమాచారం, బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ వంటి సున్నితమైన సమాచారాన్ని ఎవరికీ అందించవద్దని హెచ్చరించింది. అనుమానాస్పద సందేశాలను ఇతరులకు పంపే ముందు అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్లలో వాటి నిజానిజాలను పరిశీలించాలని సూచించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *