మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీలో భారత జట్టు అదరగొడుతోంది. వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసి విజయాల హ్యాట్రిక్ పూర్తి చేసింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌ను 7-0 గోల్స్ తేడాతో చిత్తు చేసింది. భారత స్టార్ ప్లేయర్ దీపిక హ్యాట్రిక్ గోల్స్‌తో జట్టు ఘనవిజయంలో కీలక పాత్ర పోషించింది.

తొలి నుంచే భారత్ ఆధిపత్యం

మ్యాచ్ ప్రారంభమైన నాలుగో నిమిషంలోనే నవ్నీత్ కౌర్ పెనాల్టీ స్ట్రోక్‌ను గోల్‌గా మలిచి భారత్‌కు శుభారంభం అందించింది. ఆ తర్వాత దీపిక తన ప్రతిభను చాటుకుంది. 10, 11వ నిమిషాల్లో వరుసగా రెండు గోల్స్ చేసి భారత ఆధిక్యాన్ని 3-0కు పెంచింది.

అనంతరం కూడా భారత ఆటగాళ్లు ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. 28వ నిమిషంలో ముంతాజ్ ఖాన్, 32వ నిమిషంలో సునెలితా టోపో గోల్స్ సాధించారు. దీంతో భారత్ ఆధిక్యం మరింత పెరిగింది.

దీపిక హ్యాట్రిక్.. 7-0తో ఘన విజయం

మ్యాచ్ చివరి క్వార్టర్‌లోనూ భారత్ దూకుడు కొనసాగించింది. 56వ నిమిషంలో దీపిక మరో గోల్ సాధించి తన హ్యాట్రిక్ పూర్తి చేసుకుంది. అదే నిమిషంలో నవ్నీత్ కౌర్ మరో పెనాల్టీ స్ట్రోక్‌ను గోల్‌గా మలిచింది. దీంతో భారత జట్టు 7-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది.

మిగిలిన సమయంలో థాయ్‌లాండ్‌కు ఒక్క గోల్ చేసే అవకాశం కూడా ఇవ్వకుండా భారత్ మ్యాచ్‌ను ముగించింది. ఈ టోర్నీలో ఇప్పటికే మలేషియా, దక్షిణ కొరియాలను ఓడించిన భారత జట్టు.. తాజాగా థాయ్‌లాండ్‌పై విజయంతో వరుసగా మూడో గెలుపును ఖాతాలో వేసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *