
ఎలక్ట్రిక్ వాహనదారులకు హైదరాబాద్‌లో గుడ్‌న్యూస్. నగరంలో ఈవీల కోసం బ్యాటరీ స్వాపింగ్ కేంద్రాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ కేంద్రాల్లో కేవలం రెండు నిమిషాల్లోనే ఖాళీ బ్యాటరీని ఇచ్చి, పూర్తిగా ఛార్జ్ అయిన మరో బ్యాటరీని పొందే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. బ్యాటరీ స్వాపింగ్ కేంద్రాల ఏర్పాటుకు మొత్తం 113 దరఖాస్తులు రాగా.. వాటిలో 102 కేంద్రాలకు టీజీఎస్పీడీసీఎల్ అనుమతులు మంజూరు చేసింది. ముఖ్యంగా గిగ్ వర్కర్లు, ఫుడ్ డెలివరీ ఏజెంట్లు, ఇతర డెలివరీ సిబ్బందికి ఈ సదుపాయం ఎంతో ఉపయోగకరంగా మారనుంది. ఛార్జింగ్ కోసం ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా తమ పనులను వేగంగా కొనసాగించే అవకాశం కలుగుతోంది.
హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజురోజుకూ పెరుగుతుండటంతో బ్యాటరీ స్వాపింగ్ కేంద్రాలు కూడా విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా డెలివరీ ఏజెంట్లు, గిగ్ వర్కర్లు, నిత్యం ఎక్కువ దూరం ప్రయాణించే ద్విచక్ర వాహనదారులకు ఈ కేంద్రాలు ఎంతో ప్రయోజనకరంగా మారుతున్నాయి. గంటల తరబడి ఛార్జింగ్ కోసం ఎదురుచూడకుండా.. కేవలం రెండు నిమిషాల్లోనే ఖాళీ బ్యాటరీని ఇచ్చి, పూర్తిగా ఛార్జ్ అయిన మరో బ్యాటరీని తీసుకునే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.
నగరంలో బ్యాటరీ స్వాపింగ్ కేంద్రాల ఏర్పాటుకు మొత్తం 113 దరఖాస్తులు రాగా.. వాటిలో 102 కేంద్రాలకు ఇప్పటికే విద్యుత్ కనెక్షన్ల అనుమతులు మంజూరు చేసినట్లు తెలంగాణ దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ (TGSPDCL) వెల్లడించింది. దీంతో హైదరాబాద్‌తోపాటు శివారు ప్రాంతాల్లోనూ బ్యాటరీ స్వాపింగ్ నెట్వర్క్ విస్తరిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని మరింత ప్రోత్సహించడంతోపాటు ఛార్జింగ్ కోసం వెచ్చించే సమయాన్ని తగ్గించడంలో ఈ కేంద్రాలు కీలక పాత్ర పోషించనున్నాయి.
ఆన్లైన్ డెలివరీలు, ఈ-కామర్స్, ఫుడ్ డెలివరీ రంగాల్లో పనిచేసే గిగ్ వర్కర్లు ఎక్కువగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపైనే ఆధారపడుతున్నారు. రోజంతా రోడ్లపైనే తిరుగుతూ డెలివరీలు చేయాల్సి ఉండటంతో.. బ్యాటరీ ఛార్జింగ్ కోసం వాహనాలను నిలిపివేయడం వారికి సమయం, ఆదాయం పరంగా భారంగా మారుతోంది. ఈ సమస్యకు పరిష్కారంగా పలు సంస్థలు పబ్లిక్ బ్యాటరీ స్వాపింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయి. వాహనదారులు ఆయా సంస్థలతో ఒప్పందం చేసుకుని అవసరమైనప్పుడు ఖాళీ బ్యాటరీని ఇచ్చి, ఛార్జ్ అయిన మరో బ్యాటరీని తీసుకునే సౌకర్యం పొందుతున్నారు. ఇప్పటివరకు ఈ-కామర్స్, వాణిజ్య అవసరాలకే ఎక్కువగా పరిమితమైన బ్యాటరీ స్వాపింగ్ విధానం.. ఇప్పుడు వ్యక్తిగత ఎలక్ట్రిక్ వాహనదారులకూ అందుబాటులోకి వస్తోంది.
మరోవైపు బ్యాటరీ స్వాపింగ్ కేంద్రాలు ప్రధాన రహదారులకే పరిమితం కాకుండా నివాస ప్రాంతాల్లోకి కూడా విస్తరిస్తున్నాయి. కార్ల ఛార్జింగ్ కేంద్రాలను ప్రధాన రహదారుల వెంబడి ఏర్పాటు చేస్తుండగా.. ద్విచక్ర వాహనాల బ్యాటరీ మార్పిడి కేంద్రాలను కాలనీలు, ఇరుకైన వీధుల్లోనూ నెలకొల్పుతున్నారు. సుమారు 200 గజాల స్థలంలోనే ఈ కేంద్రాలను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉండటంతో చిన్న వ్యాపారులు సైతం ఈ రంగంపై ఆసక్తి చూపుతున్నారు. భవిష్యత్తులో పెట్రోల్ బంకుల్లో కూడా బ్యాటరీ స్వాపింగ్ సదుపాయాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఇక వినియోగదారులు బ్యాటరీని పూర్తిగా కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా కొన్ని సంస్థలు నెలవారీ సబ్స్క్రిప్షన్ విధానాన్ని ప్రవేశపెడుతున్నాయి. మరికొన్ని సంస్థలు ప్రతి బ్యాటరీ మార్పిడికి నిర్దిష్ట రుసుము వసూలు చేస్తున్నాయి. ఈ విధానాలతో ఎలక్ట్రిక్ వాహనాల నిర్వహణ ఖర్చులు, ఛార్జింగ్ సమయాన్ని తగ్గించుకునే అవకాశాలు పెరుగుతున్నాయి.
బ్యాటరీ స్వాపింగ్ కేంద్రాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యంత్రాల్లో సుమారు 15 బ్యాటరీలను నిల్వ చేసుకునే సదుపాయం ఉంటుంది. వాహనంలోని ఛార్జింగ్ అయిపోయిన బ్యాటరీని తీసి యంత్రంలోని నిర్దేశిత గదిలో ఉంచాలి. అనంతరం అక్కడ ఉన్న టచ్‌స్క్రీన్ ద్వారా కార్డు లేదా మొబైల్ యాప్‌తో వివరాలను నమోదు చేయాలి. వెంటనే పూర్తిగా ఛార్జ్ అయిన మరో బ్యాటరీ యంత్రం నుంచి బయటకు వస్తుంది. దానిని వాహనంలో అమర్చుకుని ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. ఈ మొత్తం ప్రక్రియకు కేవలం రెండు నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. దీంతో పెట్రోల్ బంకులో ఇంధనం నింపించుకున్నంత వేగంగా బ్యాటరీని మార్చుకోవచ్చని నిర్వాహకులు చెబుతున్నారు.
మరోవైపు హైదరాబాద్, పరిసర ప్రాంతాలు, జాతీయ రహదారుల వెంట ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను విస్తరించేందుకు టీజీఎస్పీడీసీఎల్ ఇప్పటివరకు మొత్తం 1,638 నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు (NOC) జారీ చేసింది. వీటిలో 102 బ్యాటరీ స్వాపింగ్ కేంద్రాలకు సంబంధించిన అనుమతులు ఉన్నాయి. ఈ కేంద్రాలకు సంబంధించిన విద్యుత్ సామర్థ్యం కనిష్ఠంగా 3.3 కిలోవాట్ల నుంచి గరిష్ఠంగా 9.12 మెగావాట్ల వరకు ఉన్నట్లు డిస్కం గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
నగరంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో ఛార్జింగ్ స్టేషన్లతో పాటు బ్యాటరీ స్వాపింగ్ కేంద్రాల సంఖ్య కూడా మరింత పెరిగే అవకాశముంది. ముఖ్యంగా గిగ్ వర్కర్లు, డెలివరీ ఏజెంట్లు, వాణిజ్య వాహనదారులకు వేగంగా బ్యాటరీలు మార్చుకునే సదుపాయం అందుబాటులోకి రావడం హైదరాబాద్ రవాణా రంగంలో కీలక మార్పులకు నాంది పలకనుంది.




