
కిడ్నీ క్యాన్సర్ పెద్ద రక్తనాళానికి వ్యాపించిన 55 ఏళ్ల వ్యక్తికి కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్) యూరాలజీ వైద్యులు అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. దాదాపు ఏడు గంటల పాటు శ్రమించి రోగికి ప్రాణాపాయ పరిస్థితి నుంచి ఉపశమనం కల్పించారు. ఆరోగ్యశ్రీ పథకం కింద ఈ ఆపరేషన్ నిర్వహించడం విశేషం.
వివరాల్లోకి వెళ్తే కర్నూలు జిల్లా మద్దికెర మండలానికి చెందిన 55 ఏళ్ల వ్యక్తి గత 18 నెలలుగా చికిత్స కోసం రాయలసీమలోని పలు కార్పొరేట్ ఆసుపత్రులను సంప్రదించారు. అయినప్పటికీ ఆశించిన ఫలితం లభించలేదు. దీంతో అక్టోబర్ 23న కర్నూలు జీజీహెచ్ యూరాలజీ విభాగంలో చేరారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయన కుడి కిడ్నీకి క్యాన్సర్ సోకిందని అది ఇన్‌ఫీరియర్ వీనా కావా (IVC) అనే ప్రధాన రక్తనాళానికి వ్యాపించిందని వైద్యులు గుర్తించారు. దీన్ని స్టేజ్-3 క్యాన్సర్‌గా నిర్ధారించారు.
ఈ నేపథ్యంలో ఈ నెల 12న యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ ముత్యశ్రీ ఆధ్వర్యంలో ప్రత్యేక శస్త్రచికిత్స చేపట్టారు. అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సేపూరి బాలరవితేజ, అసిస్టెంట్ ప్రొఫెసర్లు రాజశేఖర్, మహేశ్, అరుణ్, గౌతమ్‌తో పాటు అనస్థీషియా వైద్యులు అరుణలత, సౌజన్య, పీజీ వైద్యుల బృందం ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు.
క్యాన్సర్ ప్రభావితమైన ప్రధాన రక్తనాళాన్ని పూర్తిగా మూసివేసి ఇతర రక్తనాళాల్లో రక్తప్రసరణకు ఆటంకం కలగకుండా వైద్యులు జాగ్రత్తగా శస్త్రచికిత్స నిర్వహించారు. ముఖ్యంగా ఎడమ కిడ్నీ నుంచి రక్తప్రసరణ కొనసాగేందుకు అవసరమైన మార్గాన్ని కాపాడుతూ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలాంటి శస్త్రచికిత్స ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే తొలి కేసుగా వైద్యులు పేర్కొంటున్నారు. ఈ అరుదైన ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించిన వైద్య బృందాన్ని కర్నూలు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కే. వెంకటేశ్వర్లు అభినందించారు.
ఈ సందర్భంగా యూరో అంకాలజిస్టు డాక్టర్ బాలరవితేజ మాట్లాడుతూ కిడ్నీ క్యాన్సర్ ఐవీసీ వరకు వ్యాపించి ఆ రక్తనాళం పూర్తిగా మూసుకుపోయిన పరిస్థితిలో శస్త్రచికిత్స చేయడం అత్యంత సవాలుతో కూడుకున్నదని వివరించారు. అయినప్పటికీ ఇతర కీలక రక్తనాళాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆపరేషన్ పూర్తి చేసినట్లు తెలిపారు.




