కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘంపై కీలక చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కమిషన్ ముందు ఉద్యోగ సంఘాలు వేర్వేరు ప్రతిపాదనలు ఉంచడంతో జీతాల పెంపుతో పాటు జూనియర్, సీనియర్ ఉద్యోగుల మధ్య వేతన వ్యత్యాసాన్ని ఎలా నిర్ణయించాలనే అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో వేతనాల పునర్నిర్మాణంపై ఉద్యోగ సంఘాల ప్రతిపాదనలు ఆసక్తికరంగా మారాయి.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం సిఫార్సులపై చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. ఈసారి వేతన సవరణలు కేవలం జీతాల పెంపునకే మాత్రమే పరిమితం కాకుండా, జూనియర్, సీనియర్ అధికారుల మధ్య ఉన్న వేతన వ్యత్యాసంపై కూడా ప్రభావం చూపే ఛాన్స్ కనిపిస్తోంది. ఎందుకంటే వేతన పట్టిక రూపకల్పన, జీతాల పునర్నిర్మాణంపై రెండు ప్రముఖ ఉద్యోగ సంఘాలు కమిషన్ ముందు భిన్నమైన ప్రతిపాదనలు ఉంచాయి.

మంత్రివర్గ సిబ్బంది సంఘం (MSA), భారతీయ రైల్వే సాంకేతిక పర్యవేక్షకుల సంఘం (IRTSA) సమర్పించిన ఈ ప్రతిపాదనల ప్రకారం వేతనాల్లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చనే తెలుస్తోంది. ముఖ్యంగా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ విధానంలో ఈ రెండు సంఘాల ప్రతిపాదనలు చాలా భిన్నంగా ఉన్నాయి.
ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌లో ప్రధాన తేడా
8వ వేతన సంఘం ముందు ఉద్యోగ సంఘాలు ఉంచిన ప్రతిపాదనల్లో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కీలక అంశంగా మారింది.ఎందుకుంటే MSA చేసిన ప్రతిపాదనలో అన్ని స్థాయిల ఉద్యోగులకు ఒకే ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌ను ప్రతిపాదించగా, కానీ IRTSA మాత్రం ఉద్యోగుల స్థాయిని బట్టి వేర్వేరు ఫిట్మెంట్ ఫ్యాక్టర్లు ఉండాలని పేర్కొంది.
MSA ప్రతిపాదన
MSA కనీస ప్రాథమిక వేతనాన్ని రూ.65,000గా, గరిష్ట వేతనాన్ని రూ.9 లక్షలుగా ప్రతిపాదించగా. అన్ని స్థాయిల ఉద్యోగులకు సుమారు 3.61 ఏకరీతి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ వర్తించాలని కోరింది. ఈ ప్రతిపాదన కనుక అమలైతే ప్రస్తుతం 7వ వేతన సంఘం ప్రకారం రూ.18,000గా ఉన్న లెవెల్-1 ఉద్యోగుల ప్రాథమిక వేతనం రూ.65,000కు పెరుగుతుంది. అలాగే ప్రస్తుతం రూ.2.5 లక్షలుగా ఉన్న లెవెల్-18 ఉద్యోగుల ప్రాథమిక వేతనం సుమారు రూ.9.02 లక్షలకు చేరుతుంది. అయితే, అన్ని స్థాయిల ఉద్యోగులకు ఒకే నిష్పత్తిలో వేతన పెంపు లభించడం వల్ల ప్రస్తుతం ఉన్న కనిష్ట, గరిష్ట వేతనాల మధ్య 1:13.9 నిష్పత్తిలో ఎలాంటి మార్పు ఉండదని ప్రతిపాదన సూచిస్తోంది.
IRTSA ప్రతిపాదన
భారతీయ రైల్వే సాంకేతిక పర్యవేక్షకుల సంఘం (IRTSA) మాత్రం శ్రేణీకృత ఫిట్మెంట్ ఫ్యాక్టర్ విధానాన్ని ప్రతిపాదించింది. ఈ విధానంలో ఉద్యోగుల స్థాయిని బట్టి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ మారుతుంది. ఇందులో లెవెల్-1 ఉద్యోగులకు 2.92 ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌తో ప్రారంభించి, లెవెల్-17, 18 స్థాయి అధికారులకు 4.38 వరకు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఉండాలని సంఘం కోరింది. ఈ ప్రతిపాదన అమలైతే ఉన్నత స్థాయి అధికారులకు ఎక్కువ వేతన పెంపు ఉంటుంది. తద్వారా కనిష్ట, గరిష్ట వేతనాల మధ్య నిష్పత్తి 1:20.8కి విస్తరించవచ్చని అంచనా చేసింది.
ఉద్యోగ సంఘాల ప్రధాన లక్ష్యం ఏమిటి?
సాధారణంగా ప్రతి పదేళ్లకు ఒకసారి ఏర్పాటయ్యే వేతన సంఘం ఉద్యోగ సంఘాల అభిప్రాయాలు, డిమాండ్లను సేకరించి వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తుంది. వాటిని ప్రభుత్వం పరిశీలించి సిఫార్సులను జారీ చేసింది. ఇక 9వ వేతన సంఘం ఏర్పడే వరకు, ఉద్యోగులు, పెన్షనర్ల ఆర్థిక పరిస్థితులపై 8వ వేతన సంఘం నిర్ణయాలు అమల్లో ఉంటాయి.
8వ వేతన సంఘం ముందున్న సవాళ్లు
జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యులతో ఏర్పడిన 8వ వేతన సంఘం ముందు ప్రస్తుతం కీలక సవాళ్లు ఉన్నాయి. కింది స్థాయిలో ఉన్న ఉద్యోగుల జీవిన ప్రమాణాలు మెరుగుపడేలా వారికి వేతన పెంపు కల్పించాలి. అలాగే పదోన్నతులు పొందే ఉద్యోగులు, అధిక బాధ్యతలు నిర్వర్తించే సీనియర్ అధికారులకు తగిన ఆర్థిక ప్రతిఫలం అందేలా వేతనాన్ని అందించాలి. కానీ ఇప్పుడు ఈ రెండు అంశాల మధ్య సమతుల్యం సాధించడం కమిషన్‌కు కీలకంగా మారనుంది.
అయితే పైన పేర్కొన్న వేతన గణాంకాలు ఉద్యోగ సంఘాలు సమర్పించిన ప్రతిపాదనల ఆధారంగా మాత్రమే చెప్పబడినవి.. వీటిలో ఏ ఒక్క ప్రతిపాదనను కూడా 8వ వేతన సంఘం లేదా కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా ఆమోదించలేదు.




