హైదరాబాద్‌ గోల్డ్‌మ్యాన్‌ దర్గా చిన్నగౌడ్‌ కుటుంబానికి చెందిన ఆస్తుల వ్యవహారంలో ఆదాయపు పన్ను శాఖ కీలక చర్యలు చేపట్టింది. రాయదుర్గంలో చిన్నగౌడ్‌ బంధువు ప్రణయ్‌గౌడ్‌ పేరుతో ఉన్న ఐదు అంతస్తుల అపార్ట్‌మెంట్‌ను బినామీ ఆస్తిగా అనుమానిస్తూ తాత్కాలికంగా అటాచ్‌ చేసింది. ఈ ఆస్తికి సంబంధించిన దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. స్థలం కొనుగోలు చేయడంతో పాటు అపార్ట్‌మెంట్‌ నిర్మాణానికి అవసరమైన నిధులను ప్రణయ్‌గౌడ్‌ బావ సమకూర్చినట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా, ఈ భవనం ద్వారా నెలకు వస్తున్న రూ.3.20 లక్షల అద్దెను కూడా ఆయనే స్వీకరిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం.

హైదరాబాద్‌ గోల్డ్‌మ్యాన్‌ యాదగిరి చిన్నగౌడ్‌ అలియాస్‌ దర్గా చిన్న పహిల్వాన్‌కు ఆదాయపు పన్ను శాఖ షాక్‌ ఇచ్చింది. ఆయన కుటుంబానికి సంబంధించిన ఆస్తుల వ్యవహారంలో భాగంగా ఐటీ శాఖకు చెందిన బినామీ నిరోధక విభాగం కీలక చర్యలు చేపట్టింది. హైదరాబాద్‌లోని రాయదుర్గంలో ఉన్న భారీ అపార్ట్‌మెంట్‌ భవనాన్ని తాత్కాలికంగా అటాచ్‌ చేసింది.

చిన్నగౌడ్‌ బావమరిది ప్రణయ్‌గౌడ్‌ పేరుతో రిజిస్టర్‌ అయిన ఈ భవనం.. వాస్తవానికి ఆయన బావ ప్రయోజనం కోసమే కొనుగోలు చేసిన బినామీ ఆస్తి అని ఐటీ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అపార్ట్‌మెంట్‌తో పాటు దాని ద్వారా వస్తున్న అద్దె ఆదాయంపైనా ఆంక్షలు విధించారు. ఆస్తి యాజమాన్యంపై తుది నిర్ణయం వెలువడే వరకు భవనాన్ని విక్రయించడం, ఇతరులకు బదిలీ చేయడం లేదా యాజమాన్య హక్కులను మార్చడం సాధ్యం కాకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.

ఐటీ శాఖ దర్యాప్తులో ఈ ఆస్తికి సంబంధించి పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. శేరిలింగంపల్లి పరిధిలోని రాయదుర్గం నవ ఖల్సా గ్రామంలో 222 చదరపు గజాల స్థలాన్ని 2019 జూలై 1న కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. రిజిస్ట్రేషన్‌ పత్రాల్లో ఆ స్థలం విలువను రూ.26.70 లక్షలుగా నమోదు చేశారు. ఇందులో రూ.1.70 లక్షలను నగదు రూపంలో చెల్లించగా.. మిగిలిన రూ.25 లక్షలను మూడు బ్యాంకు లావాదేవీల ద్వారా చెల్లించారు. అయితే ఈ మొత్తాన్ని తన బావే సమకూర్చినట్లు ప్రణయ్‌గౌడ్‌ విచారణలో వెల్లడించినట్లు అధికారులు గుర్తించారు.

ఆ తర్వాత ఆ స్థలంలో గ్రౌండ్‌ ఫ్లోర్‌తో పాటు ఐదు అంతస్తుల అపార్ట్‌మెంట్‌ను నిర్మించారు. ఒక్కో అంతస్తులో రెండు చొప్పున 2BHK ఫ్లాట్లు ఏర్పాటు చేశారు. భవన నిర్మాణానికి అవసరమైన నిధులను కూడా తన బావే సమకూర్చినట్లు ప్రణయ్‌ తన వాంగ్మూలంలో పేర్కొన్నారని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా డెవలపర్లకు చెల్లింపులు చేసేందుకు ఆయన తనఖా రుణం కూడా తీసుకున్నట్లు గుర్తించారు.

ప్రణయ్‌ పేరుతో ఆస్తి.. అసలు లబ్ధిదారుడు బావ?

ఈ ఆస్తి ప్రణయ్‌గౌడ్‌ పేరుతో రిజిస్టర్‌ అయినప్పటికీ.. దాని కొనుగోలు, నిర్మాణానికి అవసరమైన ఆర్థిక వనరులు ఆయనకు లేవని ఐటీ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించినట్లు సమాచారం. 2019లో స్థలం కొనుగోలు చేసిన సమయంలో తాను విద్యార్థినని, పన్ను చెల్లించదగిన ఆదాయం కూడా లేదని ప్రణయ్‌ విచారణలో వెల్లడించినట్లు తెలుస్తోంది. స్వయంగా ఆస్తిని కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత తనకు ఉందని నిరూపించే ఆధారాలను కూడా ఆయన సమర్పించలేకపోయినట్లు బినామీ నిరోధక విభాగం గుర్తించింది.

మరోవైపు స్థలం కొనుగోలు నుంచి భవన నిర్మాణం వరకు నిధులు సమకూర్చిన ఆయన బావే ఈ ఆస్తికి అసలు లబ్ధిదారుడిగా ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాత్కాలిక అటాచ్‌మెంట్‌ ఉత్తర్వుల్లో ప్రణయ్‌గౌడ్‌ను బినామీదారుడిగా, ఆయన బావను అసలు లబ్ధిదారుడిగా పేర్కొన్నట్లు సమాచారం.

ఈ అపార్ట్‌మెంట్‌ ద్వారా నెలకు రూ.3.20 లక్షల అద్దె ఆదాయం వస్తున్నట్లు ఐటీ శాఖ దర్యాప్తులో వెల్లడైంది. అద్దె ఒప్పందంలోనూ ఇదే మొత్తాన్ని పేర్కొన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే ఈ ఆదాయం ఆస్తి యజమానిగా రికార్డుల్లో ఉన్న ప్రణయ్‌గౌడ్‌ బ్యాంకు ఖాతాలోకి కాకుండా.. ఆయన బావ భార్యకు చెందిన సిటీ యూనియన్‌ బ్యాంకు ఖాతాలోకి జమ అవుతున్నట్లు గుర్తించారు. ఆ అపార్ట్‌మెంట్‌పై ఆమెకు ఎలాంటి యాజమాన్య హక్కులు లేకపోయినప్పటికీ అద్దె డబ్బులు ఆమె ఖాతాలోకి వెళ్లినట్లు దర్యాప్తులో తేలింది. అనంతరం ఆమె ఖాతా నుంచి భర్త బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ అయినట్లు బ్యాంకు లావాదేవీలు వెల్లడించాయి.

ఆస్తి విక్రయాలు, బదిలీలపై ఆంక్షలు

ఈ వ్యవహారంలో ఆదాయపు పన్ను శాఖ జాయింట్‌ కమిషనర్‌ నవంబర్‌ 17న ఆస్తి అటాచ్‌మెంట్‌కు ఆదేశాలు జారీ చేశారు. బినామీ ఆస్తుల లావాదేవీల నిషేధ చట్టం-1988లోని సెక్షన్‌ 24(4)(a) ప్రకారం హైదరాబాద్‌ బినామీ నిరోధక విభాగం తెలంగాణ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు ఉత్తర్వులు పంపించింది. దీంతో సదరు అపార్ట్‌మెంట్‌ను నిషేధిత ఆస్తుల జాబితాలో చేర్చినట్లు సమాచారం. సంబంధిత అధికారుల అనుమతి లేకుండా ఆస్తిని విక్రయించడం, ఇతరులకు బదిలీ చేయడం లేదా యాజమాన్య హక్కులను మార్చడం సాధ్యం కాదని అధికారులు స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే.. గతంలోనూ గోల్డ్‌మ్యాన్‌ చిన్నగౌడ్‌ వ్యవహారంపై ఆదాయపు పన్ను శాఖ దృష్టి సారించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆయన పలు యూట్యూబ్‌ ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలను పరిశీలించిన ఐటీ అధికారులు.. అనంతరం ఆయనకు సంబంధించిన ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మొత్తం 900 గ్రాముల బంగారం గుర్తించగా.. అందులో 700 గ్రాములకు సంబంధించి సరైన ఆదాయ వనరుల వివరాలు లేవని పేర్కొంటూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ సుమారు రూ.కోటి ఉంటుందని చిన్నగౌడ్‌ వెల్లడించినట్లు సమాచారం.

అద్దెలు, భూముల లావాదేవీల ద్వారా ఈ బంగారాన్ని సమకూర్చుకున్నట్లు ఆయన అధికారులకు వివరించినప్పటికీ.. ఆ వివరణతో ఐటీ అధికారులు సంతృప్తి చెందలేదు. మరోవైపు ఆయన దాఖలు చేసిన ఆదాయపు పన్ను రిటర్నుల్లో కేవలం రూ.4 లక్షల ఆదాయం మాత్రమే నమోదైనట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్‌లోని రాయదుర్గంలో ఉన్న అపార్ట్‌మెంట్‌ను బినామీ నిరోధక చట్టం కింద అటాచ్‌ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. చిన్నగౌడ్‌ కుటుంబానికి సంబంధించిన ఆస్తుల వ్యవహారంపై ఐటీ శాఖ దర్యాప్తు మరింత ఆసక్తికరంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *