
భారత్‌తో తొలి టెస్టుకు ముందు శ్రీలంక క్రికెట్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. శ్రీలంక వన్డే కెప్టెన్ కుశాల్ మెండిస్ చిన్ననాటి కోచ్, ప్రముఖ క్రికెట్ శిక్షకుడు సుమిత్ ఫెర్నాండో మృతి చెందారు. 62 ఏళ్ల ఫెర్నాండో కొలంబోలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశారు.
కొలంబోలోని బ్లూమ్‌ఫీల్డ్ క్రికెట్ అండ్ అథ్లెటిక్ క్లబ్ మైదానంలో ఆగస్టు 8న జరిగిన ఓ ఘర్షణలో ఫెర్నాండో గాయపడినట్లు శ్రీలంక మీడియా కథనాలు పేర్కొన్నాయి. యువ క్రికెటర్లు, మైదాన సిబ్బంది మధ్య వివాదం తలెత్తడంతో దాన్ని పరిష్కరించేందుకు ఫెర్నాండో అక్కడికి వెళ్లినట్లు సమాచారం.
ఈ సమయంలో జరిగిన ఘర్షణలో ఓ 17 ఏళ్ల యువ క్రికెటర్ దాడి చేయడంతో ఫెర్నాండో తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. అనంతరం ఆయనను కొలంబో నేషనల్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఘటనకు సంబంధించి పోలీసులు ఓ మైనర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
మృతిపై కొనసాగుతున్న దర్యాప్తు
ఫెర్నాండో మృతికి ఘర్షణలో తగిలిన గాయాలే కారణమా? లేక ఆయనకు ఉన్న ఆరోగ్య సమస్యలు పరిస్థితిని మరింత విషమింపజేశాయా? అనే అంశాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. వైద్య నివేదికల్లో ఆయనకు గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.
కుశాల్ మెండిస్‌కు చిన్ననాటి కోచ్
సుమిత్ ఫెర్నాండోకు శ్రీలంక క్రికెట్‌తో సుదీర్ఘ అనుబంధం ఉంది. మోరటువాలోని ప్రిన్స్ ఆఫ్ వేల్స్ కాలేజీలో కోచ్‌గా పనిచేసిన ఆయన.. ఎంతో మంది యువ క్రికెటర్లకు శిక్షణ ఇచ్చారు. శ్రీలంక వన్డే కెప్టెన్ కుశాల్ మెండిస్ కూడా చిన్ననాటి రోజుల్లో ఫెర్నాండో వద్ద శిక్షణ పొందాడు.
బ్లూమ్‌ఫీల్డ్ క్రికెట్ అండ్ అథ్లెటిక్ క్లబ్‌లో క్యూరేటర్‌గా కూడా పనిచేసిన ఫెర్నాండో.. దేశవాళీ క్రికెట్‌లో యువ ప్రతిభను తీర్చిదిద్దడంలో తనవంతు పాత్ర పోషించారు. ఆయన మృతితో శ్రీలంక క్రికెట్ వర్గాల్లో విషాదం నెలకొంది.
భారత్, శ్రీలంక జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్ ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ఘటన శ్రీలంక క్రికెట్ వర్గాలను తీవ్రంగా కలచివేసింది.

