ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ తన యూజర్ల కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే ‘షెడ్యూల్డ్ మెసేజెస్’ (Scheduled Messages). ఇకపై ఏదైనా సందేశాన్ని వెంటనే పంపాల్సిన అవసరం లేకుండా.. ముందుగానే తేదీ, సమయాన్ని నిర్ణయించి షెడ్యూల్ చేసుకోవచ్చు. నిర్ణయించిన సమయానికి ఆ మెసేజ్ అవతలి వ్యక్తికి ఆటోమేటిక్‌గా చేరుతుంది. ఇందుకోసం ప్రత్యేకంగా థర్డ్ పార్టీ యాప్స్ లేదా రిమైండర్లను ఉపయోగించాల్సిన అవసరం ఉండదు.

రెండు వారాల వరకు మెసేజ్ షెడ్యూల్

ఈ ఫీచర్ ద్వారా వ్యక్తిగత చాట్లతో పాటు గ్రూపుల్లోనూ సందేశాలను షెడ్యూల్ చేసుకోవచ్చు. కనీసం 10 నిమిషాల తర్వాత నుంచి గరిష్ఠంగా రెండు వారాల వరకు డెలివరీ సమయాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది. టెక్స్ట్ సందేశాలతో పాటు లింకులు, ఫొటోలు, వీడియోలను కూడా ముందుగానే షెడ్యూల్ చేయవచ్చు. అయితే ప్రస్తుతం డాక్యుమెంట్లను షెడ్యూల్ చేసే సదుపాయం లేదు.

మరో ప్రత్యేకత ఏమిటంటే.. నిర్ణయించిన సమయంలో ఫోన్‌లో ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా, వాట్సప్ యాప్‌ను మూసివేసినా సందేశం ఆటోమేటిక్‌గా డెలివరీ అవుతుంది. షెడ్యూల్ చేసిన సందేశాలకు ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ భద్రత కూడా ఉంటుందని సమాచారం.

షెడ్యూల్ చేసిన మెసేజ్‌ను డిలీట్ చేయొచ్చు

పంపాల్సిన సమయం ఇంకా రాకపోతే షెడ్యూల్ చేసిన సందేశాలను చాట్ ఇన్ఫర్మేషన్ స్క్రీన్‌లో చూడవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక సెక్షన్ అందుబాటులో ఉంటుంది. అవసరం లేదనుకుంటే అక్కడి నుంచే ఆ మెసేజ్‌ను తొలగించే అవకాశం కూడా ఉంది.

గ్రూప్ చాట్లలో మరో ప్రత్యేక నిబంధన ఉంది. ఒక సందేశాన్ని ముందుగానే షెడ్యూల్ చేస్తే.. అది డెలివరీ అయ్యే సమయానికి గ్రూపులో ఉన్న సభ్యులకు మాత్రమే చేరుతుంది. ఆ తర్వాత గ్రూపులో చేరిన కొత్త సభ్యులకు ఆ పాత సందేశం కనిపించదు.

వాట్సప్‌లో మెసేజ్ షెడ్యూల్ చేయడం ఎలా?

ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవడానికి కొన్ని సులభమైన దశలను అనుసరించాలి.

  1. ముందుగా వాట్సప్‌లో మీకు కావాల్సిన వ్యక్తి లేదా గ్రూప్ చాట్‌ను ఓపెన్ చేయాలి.
  2. పంపించాలనుకుంటున్న టెక్స్ట్ లేదా మీడియాను జత చేయాలి.
  3. సెండ్ బటన్‌పై కొద్దిసేపు లాంగ్ ప్రెస్ చేయాలి.
  4. ఆ తర్వాత కనిపించే ఆప్షన్లలో తేదీ, సమయాన్ని ఎంచుకోవాలి.
  5. షెడ్యూల్‌ను నిర్ధారించిన తర్వాత సందేశం నిర్ణీత సమయానికి ఆటోమేటిక్‌గా పంపబడుతుంది.

ప్రస్తుతం ఈ ఫీచర్ కొందరు ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లకు అందుబాటులోకి వచ్చినట్లు సమాచారం. దశలవారీగా ఇతర యూజర్లకు కూడా అందించే అవకాశం ఉంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే పుట్టినరోజు శుభాకాంక్షలు, ముఖ్యమైన రిమైండర్లు, ముందుగా పంపాల్సిన సందేశాలను సులభంగా నిర్వహించుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *