బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ ప్రస్తుతం ‘కింగ్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ‘డంకీ’ తర్వాత కొంత విరామం తీసుకున్న షారుక్.. ఈ భారీ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. డిసెంబర్ 24న ఈ సినిమా విడుదల కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. షూటింగ్ చివరి దశకు చేరుకుంటుండటంతో షారుక్ తదుపరి సినిమా ఏదనే ఆసక్తి అభిమానుల్లో పెరిగింది.

ప్రస్తుతం పలువురు దర్శకులు షారుక్‌తో సినిమాలు చేసేందుకు ఎదురుచూస్తున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఆయనతో ఇప్పటికే విజయవంతమైన చిత్రాలు చేసిన దర్శకులు సీక్వెల్స్‌పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

డాన్ 3, జవాన్ 2, పఠాన్ 2.. లైన్లో భారీ ప్రాజెక్టులు!

షారుక్ ఖాన్‌తో తెరకెక్కాల్సిన ‘డాన్ 3’ ప్రాజెక్ట్ తొలుత రణ్‌వీర్ సింగ్ దగ్గరకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా నుంచి ఆయన తప్పుకున్నట్లు వార్తలు రావడంతో మరోసారి షారుక్ పేరు తెరపైకి వచ్చింది. దర్శకుడు ఫర్హాన్ అఖ్తర్‌తో ఈ ప్రాజెక్ట్‌పై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఇందులో అట్లీ భాగస్వామ్యం ఉంటేనే షారుక్ ఆసక్తి చూపిస్తాడనే ప్రచారం కూడా సాగుతోంది.

ఇక అట్లీ దర్శకత్వంలో షారుక్‌తో ‘జవాన్ 2’ తెరకెక్కించే ఆలోచన కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు యశ్ రాజ్ ఫిల్మ్స్ ‘పఠాన్ 2’ కోసం స్క్రిప్ట్ పనులు ప్రారంభించినట్లు బాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సీక్వెల్స్‌పై ఇప్పటివరకు అధికారిక ప్రకటనలు రావాల్సి ఉంది.

షారుక్ నెక్ట్స్ మూవీగా ‘మై హూనా 2’?

ఈ భారీ సీక్వెల్స్ మధ్య దర్శకురాలు ఫరా ఖాన్ తెరకెక్కించనున్న ‘మై హూనా’ సీక్వెల్‌పై కూడా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ఫరా ఖాన్ ఇచ్చిన హింట్‌తో అభిమానుల్లో అంచనాలు పెరిగాయి.

నటుడు అర్జున్ కపూర్ ఇటీవల ‘మై హూనా’ సినిమా చూసినట్లు సోషల్ మీడియాలో వెల్లడించాడు. ఈ చిత్రానికి సీక్వెల్ తీసుకురావాలని ఫరా ఖాన్‌ను కోరుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా.. ఆమె కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. దీంతో షారుక్, ఫరా ఖాన్ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతుందనే ప్రచారం మొదలైంది.

గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘మై హూనా’, ‘ఓం శాంతి ఓం’, ‘హ్యాపీ న్యూ ఇయర్’ సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. ముఖ్యంగా షారుక్‌ను వినోదాత్మక, రొమాంటిక్ పాత్రల్లో ఫరా ఖాన్ ప్రత్యేకంగా చూపించారు.

మరి ‘కింగ్’ తర్వాత షారుక్ ఖాన్ డాన్‌గా మారతాడా? పఠాన్‌గా మరోసారి యాక్షన్‌లోకి దిగుతాడా? లేక ఫరా ఖాన్‌తో కలిసి ‘మై హూనా 2’కు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా? అనేది ఇప్పుడు బాలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది. అయితే ఆయన తదుపరి ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.