కోలీవుడ్ యంగ్ హీరో శివకార్తికేయన్ కెరీర్ ప్రస్తుతం ఆసక్తికరమైన మలుపులో ఉంది. ‘అమరన్’ సినిమాతో ఏకంగా రూ.300 కోట్ల హీరోగా ఎదిగిన ఈ స్టార్.. ఆ తర్వాత వరుస పరాజయాలను ఎదుర్కొంటున్నాడు. ఒకప్పుడు తమిళ ఇండస్ట్రీలో తదుపరి సూపర్‌స్టార్‌గా ఎదిగే అవకాశాలున్న హీరోగా గుర్తింపు తెచ్చుకున్న శివకార్తికేయన్‌కు ఇప్పుడు కథల ఎంపిక సవాలుగా మారింది.

‘అమరన్’ తర్వాత భారీ అంచనాల మధ్య వచ్చిన ‘మదరాసి’, ‘పరాశక్తి’ సినిమాలు ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాయి. స్టార్ డైరెక్టర్లు ఏఆర్ మురుగదాస్, సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. దీంతో శివకార్తికేయన్ కథల ఎంపికపై చర్చ మొదలైంది.

వాస్తవానికి ‘మదరాసి’ కథను తొలుత బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్‌కు వినిపించినట్లు, ఆ తర్వాత విజయ్ దళపతితో తెరకెక్కించాలని ప్రయత్నించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ ప్రయత్నాలు కార్యరూపం దాల్చకపోవడంతో చివరకు శివకార్తికేయన్ ఈ ప్రాజెక్టులోకి వచ్చాడు.

ఇక ‘పరాశక్తి’ ప్రాజెక్ట్ కూడా మొదట సూర్యతో ‘పురనానూరు’ పేరుతో తెరకెక్కాల్సి ఉంది. కొన్ని కారణాలతో సూర్య ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో శివకార్తికేయన్ హీరోగా ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. అయితే ఈ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఆయన తదుపరి సినిమాలపై ఆసక్తి పెరిగింది.

మరోసారి స్టార్ హీరో వదిలేసిన కథతో ఎస్కే27!

ప్రస్తుతం శివకార్తికేయన్ చేతిలో పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి. ‘థాయ్ కిళవి’తో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శివకుమార్ మురుగేశన్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. అలాగే వెంకట్ ప్రభుతో మరో ప్రాజెక్టుకు కమిట్ అయ్యాడు.

ఇదిలా ఉండగా, తాజాగా ఎస్కే27 కూడా ప్రారంభమైంది. ‘పార్కింగ్’ సినిమాతో గుర్తింపు పొందిన రామ్ కుమార్ బాలకృష్ణన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ ప్రాజెక్ట్ వెనుక కూడా ఆసక్తికరమైన కథ ఉన్నట్లు సమాచారం.

మొదట ఈ కథను శింబుతో తెరకెక్కించాలని దర్శకుడు భావించాడట. శింబు 49వ సినిమాగా ఈ ప్రాజెక్ట్ ప్రకటించే ప్రయత్నాలు జరిగినప్పటికీ, పూర్తి స్క్రిప్ట్ విషయంలో సంతృప్తి లేకపోవడంతో ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు అదే కథతో శివకార్తికేయన్ సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రంలో కయాదు లోహార్ హీరోయిన్‌గా నటించనున్నట్లు సమాచారం. అయితే ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇలా గతంలో ఇతర స్టార్ హీరోల కోసం సిద్ధం చేసిన కథలతో సినిమాలు చేసి ఎదురుదెబ్బలు తిన్న శివకార్తికేయన్.. ఇప్పుడు మరోసారి అలాంటి ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరి ఈసారి ఎస్కే27 ఆయనకు విజయాన్ని అందిస్తుందా? లేదా? అనేది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.