ఈజిప్ట్, కైరో, ఈజిప్ట్ రాజధాని కైరోలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చమురు ట్యాంకర్ పేలడంతో భారీగా మంటలు చెలరేగి 31 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

అధికారుల వివరాల ప్రకారం.. కైరోలోని గిజా గవర్నరేట్ పరిధిలో ఇంబబా ప్రాంతం సమీపంలోని వరాక్ జిల్లాలో రింగ్ రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. చమురు ట్యాంకర్ ప్రయాణిస్తుండగా హైటెన్షన్ విద్యుత్ తీగ తెగి వాహనంపై పడింది. దీంతో ట్యాంకర్ అదుపుతప్పి బోల్తాపడటంతో భారీ పేలుడు సంభవించింది. క్షణాల్లోనే మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించాయి.

మంటల్లో చిక్కుకున్న వాహనాలు

ట్యాంకర్ పేలుడు ధాటికి రోడ్డుపై వెళ్తున్న రెండు డజన్లకుపైగా కార్లు, ద్విచక్ర వాహనాలు మంటల్లో చిక్కుకుని పూర్తిగా దగ్ధమయ్యాయి. పలువురు వాహనాల్లోనే చిక్కుకుపోవడంతో అగ్నిమాపక సిబ్బంది వారిని బయటకు తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు.

చమురు ట్యాంకర్ కావడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. వాటిని అదుపులోకి తీసుకురావడానికి అగ్నిమాపక సిబ్బంది సుదీర్ఘంగా శ్రమించారు. సహాయక చర్యల కోసం 39 అంబులెన్సులను అందుబాటులో ఉంచినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఘటనాస్థలికి ఆరోగ్య శాఖ మంత్రి

ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఈజిప్టు ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ ఖలీద్ అబ్దేల్ గఫార్ ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. మంటలు తగ్గిన తర్వాత భారీగా ప్రజలు అక్కడికి చేరుకోవడంతో సహాయక బృందాల వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఈ ఘటనలో భారీ ప్రాణనష్టం, వాహనాల దగ్ధంతో కైరోలో తీవ్ర కలకలం రేగింది.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *