
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రపంచ బ్యాంకు, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) ప్రతినిధుల బృందం బుధవారం పర్యటించింది. రాజధానిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించింది. అమరావతి అభివృద్ధి ప్రాజెక్టుల అమలు తీరుతో పాటు అదనపు నిధుల విడుదలకు సంబంధించిన అంశాలపై సమీక్ష నిర్వహించింది.
ఈ సందర్భంగా సీఆర్డీఏ ఏడీసీఎల్ అధికారులతో ప్రతినిధుల బృందం సమావేశమైంది. ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్ కార్యాచరణ, పనుల పురోగతిపై చర్చించింది. ముఖ్యంగా సామాజిక భద్రత, పర్యావరణ పరిరక్షణ నిర్మాణ పనుల్లో కార్మికుల భద్రత వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది.
అలాగే రాజధాని రైతుల నుంచి అందుతున్న ఫిర్యాదులు వాటి పరిష్కారానికి అధికారులు తీసుకుంటున్న చర్యలపై ఆరా తీసింది. రైతుల సమస్యల పరిష్కారానికి అనుసరిస్తున్న విధానాలను అడిగి తెలుసుకుంది.
అనంతరం ప్రతినిధుల బృందం క్షేత్రస్థాయి పర్యటన చేపట్టింది. వైకుంఠపురం పంపింగ్ స్టేషన్ను పరిశీలించడంతో పాటు అమరావతిలో రివర్ఫ్రంట్గా అభివృద్ధి చేయనున్న ప్రాంతాలను సందర్శించింది. కృష్ణా కరకట్ట ఈ-1 రహదారి, మందడం పంచాయతీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించింది.
అదేవిధంగా సీడ్ యాక్సిస్ ఈ-3 రహదారి రెండో, మూడో దశల పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో సమీక్షించింది. వివిధ ప్రాజెక్టుల అమలు తీరును పరిశీలించిన ప్రపంచ బ్యాంకు ఏడీబీ ప్రతినిధుల బృందం అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేసింది.




