
ఆంధ్రప్రదేశ్‌లో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) భారీ ప్రాజెక్టుకు కీలక ముందడుగు పడింది. రామాయపట్నం పోర్టు సమీపంలో ఏర్పాటు చేయనున్న గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌కు కేంద్రం పర్యావరణ అనుమతులు మంజూరు చేసింది. దీంతో ప్రాజెక్టు నిర్మాణానికి మార్గం సుగమమైంది.
నెల్లూరు, ప్రకాశం జిల్లాల పరిధిలోని కావలి, గుడ్లూరు మండలాల్లో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నారు. తొలిదశలో ఏడాదికి 9 మిలియన్ టన్నుల ముడిచమురు శుద్ధి సామర్థ్యంతో రిఫైనరీని నిర్మించనున్నారు. భవిష్యత్‌లో ఈ సామర్థ్యాన్ని 12 మిలియన్ టన్నులకు పెంచే అవకాశం ఉంది. ప్రాజెక్టును 2030 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
రూ.1.50 లక్షల కోట్ల పెట్టుబడులు
రిఫైనరీ ఏర్పాటుకు రూ.96,862 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు BPCL ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. రిఫైనరీతో పాటు పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌ను కూడా ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో మొత్తం పెట్టుబడి దాదాపు రూ.1.50 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉంది.
ఐదేళ్లలో ఈ పెట్టుబడులను దశలవారీగా పెట్టాలని సంస్థ భావిస్తోంది. పర్యావరణ, కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (CRZ) అనుమతులు రావడంతో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
వేలాది మందికి ఉపాధి
భారీ స్థాయిలో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు నిర్మాణ దశలో సుమారు 14 వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత 1,250 మందికి ప్రత్యక్షంగా, మరో 3,750 మందికి పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అంచనా.
ప్రాజెక్టుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించింది. అనంతరం BPCL సమర్పించిన వివరాలను కేంద్ర నిపుణుల కమిటీ పరిశీలించి పర్యావరణ అనుమతులు మంజూరు చేసింది.
రామాయపట్నం పోర్టుకు సమీపంలో ఈ భారీ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుతో రాష్ట్ర పారిశ్రామిక రంగానికి ఊతం లభించడంతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది.
