విజయవాడ సింగ్‌నగర్ స్టేడియంలో విజయవాడ ఉత్సవ్ సీజన్-2 పనులకు శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో బోండా ఉమామహేశ్వరరావు కుమారుడు బోండా సిద్ధార్థ, ఏపీ భవన నిర్మాణ కార్మికుల సలహా సంఘం చైర్మన్ గొట్టిముక్కల రఘు, ఆంధ్రప్రదేశ్ కల్చరల్ కార్పొరేషన్ చైర్మన్ తేజస్విని పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా బోండా సిద్ధార్థ మాట్లాడుతూ విజయవాడ ఉత్సవ్ సీజన్-2ను ఈసారి మరింత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భారత రాష్ట్రపతితో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉత్సవాలకు హాజరుకానున్నారని చెప్పారు. దుర్గమ్మ, కృష్ణమ్మ చెంత ఆధ్యాత్మికత, ఆహ్లాదాన్ని మేళవిస్తూ ప్రజలకు సరికొత్త అనుభూతిని అందించడమే ఉత్సవాల లక్ష్యమన్నారు.
పున్నమిఘాట్, మాకినేని బసవపున్నయ్య (ఎంబీకే) స్టేడియంలో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని తెలిపారు. ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దసరా వేడుకలతో పాటు విజయవాడ ఉత్సవ్‌లో పాల్గొనాలని కోరారు. సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ఆధ్వర్యంలో విజయవాడ ఉత్సవాలకు అంకురార్పణ జరిగిందని గొట్టిముక్కల రఘు తెలిపారు.
మాకినేని బసవపున్నయ్య స్టేడియం, పున్నమిఘాట్, సిద్ధార్థ ఫార్మా కాలేజీ, పవిత్ర సంగమం వద్ద వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఎంపీ కేశినేని చిన్ని, బోండా ఉమామహేశ్వరరావు సారథ్యంలో ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నామని చెప్పారు.
స్థానిక కళాకారులతో పాటు దేశవ్యాప్తంగా పేరొందిన సాంస్కృతిక బృందాలను ఉత్సవాలకు ఆహ్వానిస్తున్నట్లు రఘు తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా కళాకారులకు రాబోయే కొన్ని నెలల పాటు ఉపాధి లభించే అవకాశం ఉంటుందన్నారు. ఈసారి ప్రత్యేకంగా లేజర్ షోలు, డ్రోన్ షోలు, క్రాకర్ షోలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.