వ్యవసాయ భూముల్లో నాలా అనుమతులు పొందకుండానే నిర్మించిన నివాసాల రిజిస్ట్రేషన్లకు తెలంగాణ ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. ఇప్పటివరకు ఇలాంటి భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ఇచ్చిన హామీ మేరకు రెవెన్యూ శాఖ ఈ నెల 3న మెమో జారీ చేసింది. కోర్టు కేసులు, న్యాయ వివాదాలు లేని అర్హమైన నాలా దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించింది.

అయితే ఈ ప్రక్రియలో ప్రభుత్వం ఓ నిబంధన విధించనున్నట్లు తెలుస్తోంది. నాలా రుసుముతో పాటు అదనంగా 50 శాతం మొత్తాన్ని చెల్లించిన వారికి మాత్రమే రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. దీనిపై ప్రభుత్వం అధికారికంగా జీవో జారీ చేయాల్సి ఉంది.

తెలంగాణలో నాలా అనుమతులు లేకుండా వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు వినియోగించి నిర్మించిన నివాసాల రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు నాలా రుసుము చెల్లించి అనుమతులు పొందని ఇలాంటి భూములను నిషేధిత జాబితా 22ఏలో కొనసాగించడంతో వాటి రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి.

దీంతో ఏళ్ల తరబడి తమ ఆస్తులను విక్రయించుకోలేక, కొనుగోలుదారుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకోలేక యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇలాంటి ఆస్తుల రిజిస్ట్రేషన్లకు అడ్డంకులు తొలగే అవకాశం ఏర్పడింది.

22ఏ భూముల సమస్యల పరిష్కారానికి రెవెన్యూ శాఖ కీలక చర్యలు

22ఏ కింద ఉన్న భూముల సమస్యలను పరిష్కరిస్తామని ఇటీవల అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ నేపథ్యంలో రెవెన్యూ శాఖ కీలక చర్యలు చేపట్టింది. ఈ నెల 3న రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్‌ కుమార్ మెమో జారీ చేసినట్లు సమాచారం.

నాలా అనుమతుల కోసం వచ్చే దరఖాస్తుల్లో కోర్టు కేసులు లేదా ఇతర న్యాయ వివాదాలు లేని అర్హమైన దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాలని మెమోలో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

రెవెన్యూ శాఖ తాజా నిర్ణయంతో చాలాకాలంగా నాలా అనుమతుల కోసం ఎదురుచూస్తున్న భూ యజమానులకు ఊరట లభించే అవకాశం ఉంది. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు వినియోగించినప్పటికీ నాలా మార్పిడి ప్రక్రియ పూర్తికాక రిజిస్ట్రేషన్ నిలిచిపోయిన భూములకు కూడా పరిష్కారం లభించే అవకాశముంది.

అయితే దరఖాస్తులను పరిష్కరించే ముందు భూమి అర్హత, దానిపై ఎలాంటి న్యాయ వివాదాలు ఉన్నాయా లేదా, అలాగే సంబంధిత రెవెన్యూ రికార్డులను అధికారులు పూర్తిగా పరిశీలించనున్నారు. నిబంధనలకు అనుగుణంగా ఉన్న దరఖాస్తులకే నాలా అనుమతులు మంజూరు చేయనున్నారు

ఇదిలా ఉండగా.. ఈ నిర్ణయంతో మరో కీలక అంశం కూడా తెరపైకి వచ్చింది. నాళా రుసుముతో పాటు అదనంగా 50 శాతం మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని సమాచారం. ఈ అదనపు మొత్తాన్ని చెల్లించిన తర్వాతే రిజిస్ట్రేషన్ ప్రక్రియకు అనుమతి లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఉదాహరణకు, ఒక భూమికి నాళా రుసుము రూ.3 లక్షలు ఉంటే.. దానికి అదనంగా 50 శాతం మేర రూ.1.50 లక్షలు చెల్లించాలి. దీంతో నాళా రుసుముతో కలిపి మొత్తం రూ.4.50 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.