సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘జైలర్’కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘జైలర్ 2’పై భారీ అంచనాలు ఉన్నాయి. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు ట్రైలర్ తాజాగా విడుదలైంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

మరోసారి టైగర్ ముత్తువేల్ పాండియన్

రజనీకాంత్ మరోసారి ‘టైగర్ ముత్తువేల్ పాండియన్’ పాత్రలో తనదైన స్టైల్, స్వాగ్‌తో కనిపించారు. ‘జైలర్’లో వర్మన్‌ను అంతం చేసిన తర్వాత కూడా ముత్తువేల్ పాండియన్ ఎక్కడికీ వెళ్లలేదని, అతడిని పట్టుకోవడం ఎవరి వల్లా కాదనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. “అసలు ఎవడతను? అతడి వెనుక ఇంకెవరున్నారు?” అంటూ శత్రువులు భయపడే సన్నివేశాలు ఆసక్తిని పెంచుతున్నాయి.

నెల్సన్ మార్క్ డార్క్ హ్యూమర్ కూడా ట్రైలర్‌లో అక్కడక్కడా కనిపించింది. ముఖ్యంగా “శత్రువులందరినీ ఒకే గూటికి పిలిచి.. ఒకేసారి బాంబుతో లేపేయడమే ఇప్పటి ట్రెండ్” అనే డైలాగ్ రజనీ అభిమానులను ఆకట్టుకునేలా ఉంది. అనిరుధ్ రవిచందర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని సన్నివేశాలకు మంచి ఎలివేషన్ ఇచ్చింది.

ఫస్ట్ పార్ట్‌తో పోలిస్తే ఆ స్థాయి ఇంపాక్ట్ ఉందా?

ట్రైలర్‌లో రజనీకాంత్ స్వాగ్, యాక్షన్, డార్క్ కామెడీ కనిపించినప్పటికీ.. ‘జైలర్’ మొదటి భాగం ఇచ్చినంత హై మాత్రం ఈ ట్రైలర్ ఇవ్వలేకపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఫస్ట్ పార్ట్‌లో వచ్చిన గూస్‌బంప్స్ మూమెంట్స్, ఇంటర్వెల్ బ్యాంగ్, శివరాజ్‌కుమార్, మోహన్‌లాల్ వంటి స్టార్ హీరోల క్యామియోలు సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేశాయి.

అయితే ‘జైలర్ 2’ ట్రైలర్‌ను చూస్తే మాత్రం రివెంజ్ డ్రామాకు డార్క్ కామెడీని జోడించినట్టుగా అనిపిస్తోంది. కథలో కొత్తదనం కంటే రజనీ ఇమేజ్, యాక్షన్, స్వాగ్‌పైనే ఎక్కువగా ఫోకస్ చేసినట్టుగా కనిపిస్తోంది. స్టార్ కాస్ట్ ఉన్నప్పటికీ.. ఫస్ట్ పార్ట్‌లో కనిపించిన సర్‌ప్రైజ్ ఎలిమెంట్ ఈ ట్రైలర్‌లో అంతగా కనిపించలేదనే ఫీలింగ్ కలుగుతోంది.

అయితే ట్రైలర్‌తో వచ్చిన ఈ అంచనాలను సినిమా ఎంతవరకు మార్చగలదనేది ఆసక్తికరంగా మారింది. నెల్సన్ సినిమాలో మరిన్ని ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లు దాచిపెట్టారా? రజనీకాంత్ మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తారా? అనేది సినిమా విడుదల తర్వాతే తేలనుంది.