• తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ అని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన టీడీపీ ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్, చంద్రబాబు, నారా లోకేశ్ బీసీల హక్కుల కోసం పోరాడుతున్నారని తెలిపారు. బీసీలే టీడీపీకి వెన్నెముక అని పేర్కొన్నారు.
  • టీడీపీకి అండగా నిలుస్తున్న బీసీలను ఆదరించడం పార్టీ కర్తవ్యమని మంత్రి అన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న నిర్ణయానికి పార్టీ కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారని తెలిపారు. రాజ్యాంగబద్ధంగా బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల హక్కు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం పోరాడుతోందన్నారు.
  • వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డిపై మండిపల్లి విమర్శలు చేశారు. జగన్‌కు అవగాహన లేదని ఆరోపించిన ఆయన మరోవైపు విజన్ ఉన్న ఆర్థికవేత్తగా చంద్రబాబు ఉన్నారని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో కోర్టు తీర్పులు ఎలా ఉన్నా తమ పార్టీ 34 శాతం బీసీ రిజర్వేషన్ల అజెండాకు కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.
  • గత ఎన్నికల్లో పరాజయం పాలైన వైసీపీ బీసీ రిజర్వేషన్ల విషయంలో మొసలి కన్నీరు కారుస్తోందని మంత్రి విమర్శించారు. కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేసి ఎన్నికలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదంటూ వైసీపీ చేస్తున్న ప్రచారం వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నమని మండిపల్లి అన్నారు.
  • కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే 15వ ఆర్థిక సంఘం నిధులు వచ్చాయని మంత్రి తెలిపారు. గ్రామీణ రహదారులు, పంచాయతీరాజ్ వ్యవస్థ అభివృద్ధికి సుమారు రూ.7,500 కోట్లతో కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. రాష్ట్రంలో మూడు లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని వెల్లడించారు.
  • రాయలసీమ ప్రాంతానికి లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులతో హార్టికల్చర్ మిషన్‌ను తీసుకొచ్చామని మండిపల్లి తెలిపారు. మదనపల్లెలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటుకు చర్యలు ప్రారంభించామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మరో పేరు చంద్రబాబు నాయుడేనని వ్యాఖ్యానించారు.

By Rajini