దేశ రక్షణ రంగంలో హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (HSL) కీలకపాత్ర పోషిస్తోందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. మంగళవారం విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్‌లో భారత నౌకాదళం కోసం నిర్మిస్తున్న తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ (FSS-1)కు ‘సూర్య’గా నామకరణం చేసిన శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ పురాతన కాలం నుంచే సముద్ర మార్గాల ద్వారా నౌకాయానం, వాణిజ్యం కొనసాగుతున్నాయని గుర్తుచేశారు. హిందుస్థాన్ షిప్‌యార్డ్ దేశానికి ‘మారిటైమ్ కాస్టోడియన్’గా సేవలందిస్తోందని పేర్కొన్నారు. జల ఉష నౌక నిర్మాణం నుంచి ఆధునిక యుద్ధ, సహాయక నౌకల నిర్మాణం వరకు హెచ్ఎస్ఎల్ ప్రస్థానం ప్రశంసనీయమని అన్నారు.
2025లో హిందుస్థాన్ షిప్‌యార్డ్‌కు ‘మినీ రత్న’ హోదా లభించిందని కేంద్ర మంత్రి తెలిపారు. సముద్ర సంబంధిత అంతర్జాతీయ నియమ నిబంధనలను పాటిస్తూ దేశ రక్షణతో పాటు సముద్ర భద్రతకు కూడా భారత్ కృషి చేస్తోందన్నారు. హెచ్ఎస్ఎల్ కేవలం నౌకల నిర్మాణ సంస్థ మాత్రమే కాదని, దేశ రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేసే కీలక వ్యవస్థ అని పేర్కొన్నారు.
సుమారు 26 ఏళ్ల క్రితం రవాణా మంత్రిగా ఉన్న సమయంలో హెచ్ఎస్ఎల్ కోసం విశాఖపట్నానికి వచ్చిన విషయాన్ని రాజ్‌నాథ్ సింగ్ గుర్తుచేశారు. ఇప్పుడు రక్షణ మంత్రిగా అదే సంస్థకు రావడం సంతోషంగా ఉందన్నారు. ‘ఆత్మనిర్భర్ భారత్’తో దేశంలో ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుందని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మారిటైమ్ రంగానికి అందిస్తున్న సహకారాన్ని రాజ్‌నాథ్ సింగ్ ప్రస్తావించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారం అభినందనీయమని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు.
అంతకుముందు భారత నౌకాదళం కోసం నిర్మిస్తున్న తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ (FSS-1) ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాజ్‌నాథ్ సింగ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సముద్రంలో యుద్ధ నౌకలకు ఇంధనం, అవసరమైన సామగ్రి, ఆహార పదార్థాలను సరఫరా చేయడంలో ఫ్లీట్ సపోర్ట్ షిప్ కీలకంగా పనిచేయనుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఎంపీ శ్రీభరత్‌తో పాటు నేవీ, హిందుస్థాన్ షిప్‌యార్డ్ అధికారులు పాల్గొన్నారు.