హైదరాబాద్‌ ఫ్యూచర్‌సిటీ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇందులో భాగంగా కొత్తగా ఆమనగల్, కొత్తూరు, మొయినాబాద్‌ శాంతిభద్రతల డివిజన్లను ఏర్పాటు చేసింది. అలాగే అజీజ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌తో పాటు మూడు మహిళా పోలీస్‌స్టేషన్లు, మూడు కొత్త ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్లను ఏర్పాటు చేసింది.

ఇక శంషాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పేరును పెద్దషాపూర్‌గా మార్చింది. ఆర్‌జీఐఏ పోలీస్‌స్టేషన్‌కు శంషాబాద్‌గా పేరు పెట్టింది. ఇప్పటివరకు మల్కాజిగిరి పరిధిలో ఉన్న అబ్దుల్లాపూర్‌మెట్‌ను కూడా ఫ్యూచర్‌సిటీ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోకి తీసుకొచ్చింది.

హైదరాబాద్‌ ఫ్యూచర్‌సిటీ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో పెరుగుతున్న జనాభా, వేగవంతమైన పట్టణీకరణ, పారిశ్రామిక అభివృద్ధికి అనుగుణంగా ప్రభుత్వం పోలీసింగ్‌ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించింది. ఇందులో భాగంగా కొత్త శాంతిభద్రతల డివిజన్లు, ట్రాఫిక్‌ జోన్లు, ట్రాఫిక్‌ డివిజన్లు, పోలీస్‌స్టేషన్లను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇప్పటివరకు మల్కాజిగిరి కమిషనరేట్‌ పరిధిలో ఉన్న అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌ను కూడా ఫ్యూచర్‌సిటీ కమిషనరేట్‌ పరిధిలోకి తీసుకొచ్చింది. దీంతో ఫ్యూచర్‌సిటీ పరిధిలో పోలీస్‌ పరిపాలన మరింత విస్తరించనుంది.

హైదరాబాద్‌, మల్కాజిగిరి, సైబరాబాద్‌ కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణతో పాటు వాటి సరిహద్దుల ఖరారుకు సంబంధించి ప్రభుత్వం సెప్టెంబరు 30న మూడు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ఫ్యూచర్‌సిటీ పోలీస్‌ కమిషనరేట్‌కు సంబంధించి ప్రత్యేక ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ మార్పులతో భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా పోలీసింగ్‌ వ్యవస్థను మరింత సమర్థంగా నిర్వహించేందుకు మార్గం సుగమమైంది.

ఫ్యూచర్‌సిటీ కమిషనరేట్‌ పరిధిలో శాంతిభద్రతల నిర్వహణను మరింత పటిష్ఠం చేసేందుకు ఆమనగల్‌, కొత్తూరు, మొయినాబాద్‌ పేర్లతో మూడు కొత్త శాంతిభద్రతల డివిజన్లను ఏర్పాటు చేశారు. ఈ డివిజన్ల పరిధిలోని పోలీస్‌స్టేషన్లను పునర్వ్యవస్థీకరించడంతో పాటు, అవసరమైన ప్రాంతాల్లో కొత్త పోలీస్‌స్టేషన్లను కూడా ఏర్పాటు చేశారు.

మొయినాబాద్‌ డివిజన్‌ పరిధిలోని కొన్ని ప్రాంతాలను విడదీసి అజీజ్‌నగర్‌ పేరుతో కొత్త పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. అలాగే మహేశ్వరం, షాద్‌నగర్‌, చేవెళ్ల జోన్లకు ఒక్కొక్కటి చొప్పున మూడు మహిళా పోలీస్‌స్టేషన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో మహిళలకు సంబంధించిన ఫిర్యాదులు, కేసుల దర్యాప్తు, పరిష్కారానికి ప్రత్యేక పోలీసింగ్‌ వ్యవస్థ అందుబాటులోకి రానుంది.

పోలీస్‌స్టేషన్ల పేర్లలోనూ కీలక మార్పులు చేశారు. శంషాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పేరును పెద్దషాపూర్‌గా మార్చి, దాన్ని కొత్తూరు డివిజన్‌, షాద్‌నగర్‌ జోన్‌ పరిధిలోకి తీసుకొచ్చారు. గతంలో శంషాబాద్‌, ఆర్‌జీఐఏ పేర్లతో రెండు పోలీస్‌స్టేషన్లు ఉండేవి. వీటిలో శంషాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ ఫ్యూచర్‌సిటీ కమిషనరేట్‌ పరిధిలో ఉండగా, ఆర్‌జీఐఏ పోలీస్‌స్టేషన్‌ హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ఉండేది.

తాజా పునర్వ్యవస్థీకరణలో ఆర్‌జీఐఏ పోలీస్‌స్టేషన్‌కు శంషాబాద్‌గా పేరు మార్చారు. మరోవైపు పాత శంషాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ను పెద్దషాపూర్‌గా మార్చడంతో పాటు, దాని పరిధిలోని ప్రాంతాల్లోనూ మార్పులు చేశారు.

అదేవిధంగా గ్రీన్‌ ఫార్మాసిటీ పోలీస్‌స్టేషన్‌ పేరును మీర్‌ఖాన్‌పేటగా మార్చారు. కొత్త పరిపాలనా సరిహద్దులకు అనుగుణంగా ప్రాంతాల పేర్లు, పోలీస్‌స్టేషన్ల పరిధులను సర్దుబాటు చేశారు.

ఇప్పటివరకు మల్కాజిగిరి కమిషనరేట్‌ పరిధిలో ఉన్న అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌ను కూడా తాజాగా ఫ్యూచర్‌సిటీ కమిషనరేట్‌లోని మహేశ్వరం జోన్‌ పరిధిలోకి తీసుకొచ్చారు. ఈ పునర్వ్యవస్థీకరణతో కొత్త కమిషనరేట్‌ పరిధిలో పోలీసింగ్‌ వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు మార్గం సుగమమైంది.

ఫ్యూచర్‌సిటీ కమిషనరేట్‌ పరిధిలో ఇప్పటివరకు ఉన్న ఒక్క ట్రాఫిక్‌ జోన్‌ను ట్రాఫిక్‌-1, ట్రాఫిక్‌-2గా రెండు జోన్లుగా పునర్వ్యవస్థీకరించారు. వీటి పరిధిలో చేవెళ్ల, షాద్‌నగర్‌, మహేశ్వరం పేర్లతో మూడు ట్రాఫిక్‌ డివిజన్లను ఏర్పాటు చేశారు. అదేవిధంగా మొయినాబాద్‌, కొత్తూరు, ఆమనగల్‌ ప్రాంతాల్లో మూడు కొత్త ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్లను అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఫ్యూచర్‌సిటీ అభివృద్ధి వేగం పుంజుకుంటున్న నేపథ్యంలో రహదారులపై వాహనాల రాకపోకలు పెరగడంతో పాటు కొత్త నివాస ప్రాంతాలు, పారిశ్రామిక కార్యకలాపాలు విస్తరించే అవకాశం ఉంది. ఈ పరిణామాలకు అనుగుణంగా శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ట్రాఫిక్‌ నియంత్రణ, నిర్వహణను మరింత సమర్థంగా చేపట్టేందుకు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశారు. తాజా పునర్వ్యవస్థీకరణతో ఫ్యూచర్‌సిటీ పరిధిలో పోలీసింగ్‌ వ్యవస్థను మరింత విస్తరించి, భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా సేవలను బలోపేతం చేయడానికి అవకాశం కలుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు