
విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో కరువు ప్రభావిత మండలాల రైతులకు ఊరట లభించింది. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) కరువు మండలాల్లో రైతుల రుణాలను రీషెడ్యూల్ చేయాలని నిర్ణయించింది. విజయవాడలో మంగళవారం జరిగిన ప్రత్యేక ఎస్ఎల్బీసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
అక్టోబర్ 1 నాటికి రుణాలు ‘స్టాండర్డ్’ కేటగిరీలో ఉన్న రైతులను రీషెడ్యూల్కు అర్హులుగా నిర్ణయించారు. వ్యవసాయం, పశుసంవర్ధక, మత్స్య, పట్టు పరిశ్రమ, ఆగ్రో/ఫుడ్ ప్రాసెసింగ్, ఇతర వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన రుణాలకు ఈ వెసులుబాటు వర్తించనుంది.
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 388 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించింది. వీటిలో 283 మండలాలు తీవ్ర, 105 మండలాలు మధ్యస్థ కరువు ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నాయి.
12 నెలల మారటోరియం
తీవ్ర కరువు ప్రభావిత మండలాల్లో రైతులకు 12 నెలల మారటోరియం కల్పించనున్నారు. మారటోరియం కాలంతో కలిపి రుణాల చెల్లింపు గడువును 60 నెలలకు పొడిగించారు. మధ్యస్థ కరువు ప్రభావిత మండలాల్లోనూ 12 నెలల మారటోరియం ఉండనుండగా, మొత్తం రుణ చెల్లింపు గడువును 36 నెలలకు పెంచారు.
రుణాల రీషెడ్యూల్తో రైతులపై తక్షణ రుణ చెల్లింపుల ఒత్తిడి తగ్గనుంది. కరువు ప్రభావిత ప్రాంతాల్లో అదనపు ఉపశమన చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఇప్పటికే కలెక్టర్లను ఆదేశించింది.
