పట్టణాలకు దీటుగా పల్లెలను అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. మంగళవారం ఓర్వకల్లు మండలంలోని లొద్దిపల్లె, ఉయ్యాలవాడ, ఉప్పలపాడు గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను టీటీడీ బోర్డు సభ్యుడు మల్లెల రాజశేఖర్‌తో కలిసి ఆమె ప్రారంభించారు.
లొద్దిపల్లె గ్రామంలో జల్‌జీవన్ మిషన్-2.0 కింద రూ.30 లక్షల వ్యయంతో చేపట్టనున్న తాగునీటి పైపులైన్, బోరు పనులకు ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. ఉయ్యాలవాడలో కొండపై వెలసిన లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లే రహదారి నిర్మాణానికి టీటీడీ నిధులతో మంజూరైన రూ.1.83 కోట్ల పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు.
పల్లె పండుగ 1, 2 కింద ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో రూ.70 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. అలాగే పల్లె పండుగ-3 కింద రూ.20 లక్షలతో చేపట్టనున్న మరో సీసీ రోడ్డు పనులకు భూమిపూజ చేశారు. రూ.40 లక్షలతో నిర్మించిన హెల్త్ క్లినిక్ సెంటర్‌ను కూడా ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ పాణ్యం నియోజకవర్గంలో పల్లె పండుగ కార్యక్రమం ద్వారా మొత్తం రూ.37.97 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఓర్వకల్లు మండలాన్ని భవిష్యత్తులో ఇండస్ట్రియల్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధితో పాటు ఉపాధి అవకాశాలను పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర విద్యా సంక్షేమ మౌలిక వసతుల సంస్థ డైరెక్టర్ నాగముని, మండల స్పెషల్ ఆఫీసర్ సునీల్ కుమార్, ఎంపీడీవో నాగ అనసూయ, ఏఈ సురేంద్రరెడ్డి, శ్రీనివాసులు, ఈవోలు చంద్రశేఖర్ రెడ్డి, మద్దిలేటి, నన్నూరు సొసైటీ అధ్యక్షుడు నాగేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.