
మూసీ నది ఒడ్డున ప్రతిపాదించిన ఓంకారేశ్వర స్వామి ఆలయ సముదాయ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. ఆలయ సముదాయ నిర్మాణం, అభివృద్ధి పనుల కోసం రూ.948.65 కోట్లు, ఆరు లేన్ల రహదారి నిర్మాణానికి రూ.159.62 కోట్లు మంజూరు చేసింది. దీంతో ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం రూ.1,108.27 కోట్లకు పరిపాలనా అనుమతులు జారీ అయ్యాయి.
ప్రాజెక్టులో భాగంగా ఇస్తానా విల్లాస్ నుంచి కీర్తి వెస్ట్‌విండ్ విల్లాస్ వరకు సుమారు 2.5 కిలోమీటర్ల మేర 100 అడుగుల వెడల్పుతో ఆరు లేన్ల రహదారిని నిర్మించనున్నారు.
ప్రాజెక్టు పనుల పర్యవేక్షణ, సమన్వయం కోసం రోడ్లు భవనాల శాఖ (ఆర్అండ్బీ), పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో ప్రత్యేక సాంకేతిక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
హైదరాబాద్ నగర శివారులో మూసీ నది పరివాహక ప్రాంత అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గండిపేట మండలం మంచిరేవుల పరిధిలోని ఓంకారేశ్వర స్వామి ఆలయ సముదాయ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించింది. ఆలయ అభివృద్ధితో పాటు ఆరు లేన్ల రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తూ మొత్తం రూ.1,108.27 కోట్లకు పరిపాలనా అనుమతులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో నంబర్ 928ను విడుదల చేసింది.
మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా చేపట్టనున్న ఈ పనులతో మంచిరేవులలోని ఓంకారేశ్వర ఆలయానికి ఆధునిక మౌలిక వసతులు, మెరుగైన రహదారి కనెక్టివిటీ అందుబాటులోకి రానుంది. ఆలయ సముదాయ నిర్మాణం, అభివృద్ధి పనులకు రూ.948.65 కోట్లు కేటాయించగా.. ఆరు లేన్ల రహదారి నిర్మాణానికి మరో రూ.159.62 కోట్లు మంజూరు చేశారు.
ప్రతిపాదిత ఓంకారేశ్వర స్వామి ఆలయ సముదాయంలో పలు కీలక నిర్మాణాలు చేపట్టనున్నారు. ఆలయ ప్రాంగణాన్ని ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాధాన్యతకు అనుగుణంగా తీర్చిదిద్దేలా రాజగోపురాలు, యాగశాల, పుష్కరిణి తదితర నిర్మాణాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుతో మంచిరేవుల ప్రాంతంలో ఆలయ అభివృద్ధితో పాటు మౌలిక వసతులు కూడా గణనీయంగా మెరుగుపడనున్నాయి.
మూసీ నది తీర ప్రాంతాన్ని ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ ప్రణాళికలో భాగంగా మంచిరేవులలో ఓంకారేశ్వర స్వామి ఆలయ సముదాయాన్ని అభివృద్ధి చేయనున్నారు. గతంలోనే మంచిరేవులలోని పురాతన వీరభద్రస్వామి ఆలయ ప్రాంగణంలో ఓంకారేశ్వర మందిర నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికలను ప్రభుత్వం ప్రకటించింది.
ఆలయానికి మెరుగైన రహదారి సౌకర్యం కల్పించేందుకు ఆరు లేన్ల రహదారిని నిర్మించనున్నారు. సుమారు 30 మీటర్లు అంటే 100 అడుగుల వెడల్పుతో ఈ రహదారిని అభివృద్ధి చేయనున్నారు. ఇస్తానా విల్లాస్ నుంచి కీర్తి వెస్ట్‌విండ్ విల్లాస్ వరకు సుమారు 2.5 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణం చేపట్టనున్నారు.
ఈ రహదారి గ్రేహౌండ్స్, యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రాంతాలను కూడా అనుసంధానించనుంది. దీంతో మూసీ రివర్‌ఫ్రంట్ రోడ్ నెట్వర్క్ నుంచి ఓంకారేశ్వర ఆలయ సముదాయానికి మెరుగైన రవాణా సౌకర్యం, కనెక్టివిటీ అందుబాటులోకి రానుంది.
మరోవైపు, ఓంకారేశ్వర ఆలయ అభివృద్ధి పనుల పర్యవేక్షణకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆర్అండ్బీ ఇంజినీరింగ్ చీఫ్ ఈ కమిటీకి ఛైర్మన్‌గా, పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ చీఫ్ కో-ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఆలయ సముదాయ నిర్మాణం, మౌలిక వసతుల కల్పన, ఇతర సాంకేతిక అంశాలకు సంబంధించిన పనులను ఈ కమిటీ పర్యవేక్షించనుంది.
