Washing Machine Safety Tips : వాషింగ్ మెషీన్‌తో బట్టలు ఉతకడం చాలా సులభమైపోయింది. అయితే మెషీన్‌ను సరైన విధంగా ఉపయోగించకపోతే బట్టల నాణ్యత దెబ్బతినడంతో పాటు, మెషీన్ పనితీరుపైనా ప్రభావం పడొచ్చు. ముఖ్యంగా బట్టల పరిమాణానికి మించి లోడ్ చేయడం, సరైన మోతాదులో డిటర్జెంట్ వాడకపోవడం, మెషీన్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేయకపోవడం వంటి పొరపాట్లకు దూరంగా ఉండాలి. వాషింగ్ మెషీన్‌ను ఎక్కువకాలం సమర్థంగా ఉపయోగించాలంటే నిపుణులు సూచించే కొన్ని జాగ్రత్తలను తప్పక పాటించాలి.

Washing Machine Detergent Overuse : దుస్తులు మరింత శుభ్రంగా అవుతాయనే ఉద్దేశంతో చాలామంది వాషింగ్ మెషీన్‌లో అవసరానికి మించి డిటర్జెంట్ పౌడర్, లిక్విడ్ లేదా ఇతర క్లీనింగ్ కెమికల్స్‌ ఉపయోగిస్తుంటారు. అయితే ఇలా ఎక్కువగా వాడటం వల్ల దుస్తులపై డిటర్జెంట్ అవశేషాలు మిగిలిపోవడంతో పాటు చర్మంపై దురద, చికాకు, అలర్జీ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాదు.. మిషన్‌లో కూడా డిటర్జెంట్ అవశేషాలు పేరుకుపోయి దాని పనితీరుపై ప్రభావం చూపొచ్చు. అందుకే డిటర్జెంట్‌ను సరైన మోతాదులో వాడటంతో పాటు కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

రసాయనాలను నేరుగా చేత్తో తాకొద్దు : వాషింగ్ మెషీన్‌లో డిటర్జెంట్ పౌడర్, సోడా లేదా ఇతర క్లీనింగ్ పదార్థాలను వేయేటప్పుడు వాటిని నేరుగా చేతులతో తాకడం మంచిది కాదు. కొన్ని రసాయనాలు చర్మాన్ని ఇరిటేట్ చేయవచ్చు. దీంతో ఎర్రబారడం, మంట, దురద, పొక్కులు, చర్మం పొడిబారడం లేదా పొట్టులా ఊడిపోవడం వంటి సమస్యలు రావచ్చు. ఇలాంటి పరిస్థితిని కాంటాక్ట్ డెర్మటైటిస్‌గా పరిగణిస్తారు. కాబట్టి అవసరమైతే గ్లౌవ్స్‌ ధరించి రసాయనాలను హ్యాండిల్ చేయడం సురక్షితం.

డిటర్జెంట్ ఎక్కువైతే దుస్తులకూ నష్టమే : అవసరానికి మించి డిటర్జెంట్ ఉపయోగిస్తే అది దుస్తుల ఫైబర్ల మధ్య పూర్తిగా తొలగిపోకుండా మిగిలే అవకాశం ఉంటుంది. ఈ అవశేషాలు చర్మాన్ని తాకడం వల్ల సున్నితమైన చర్మం ఉన్నవారిలో దురద, చికాకు లేదా దద్దుర్లు రావచ్చు. అలాగే అధికంగా కెమికల్స్‌ ఉపయోగించడం వల్ల కొన్ని దుస్తుల రంగు త్వరగా వెలిసే అవకాశం ఉంటుంది. డిటర్జెంట్‌ అవశేషాలు వాషింగ్ మెషీన్‌లో పేరుకుపోతే దుర్వాసన, మురికి లేదా బూజు వంటి సమస్యలు కూడా తలెత్తొచ్చు.

వాషింగ్ మెషీన్ ఉన్నా లేకపోయినా దుస్తుల శుభ్రత కోసం చాలామంది వివిధ రకాల డిటర్జెంట్లు, సోడాలు, క్లీనింగ్ కెమికల్స్‌ ఉపయోగిస్తుంటారు. అయితే వాటిని అవగాహన లేకుండా ఇష్టానుసారం ఎక్కువగా వాడటం సరికాదు. అధికంగా ఉపయోగించిన రసాయనాలు దుస్తులపై మిగిలిపోతే చర్మ సమస్యలకు కారణమయ్యే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని పదార్థాలు చర్మాన్ని ఇరిటేట్ చేయవచ్చు. అందువల్ల డిటర్జెంట్లను నేరుగా చేతులతో హ్యాండిల్ చేయకుండా, అవసరమైతే గ్లౌవ్స్‌ ఉపయోగించడం మంచిది. – ఆచార్య ఇందిర, అసోసియేట్ ప్రొఫెసర్, చర్మ వ్యాధుల విభాగం, ఏలూరు బోధనాసుపత్రి

డిటర్జెంట్ ఎంత మోతాదులో వాడాలి? : వాషింగ్ మెషీన్‌లో దుస్తుల పరిమాణం, డిటర్జెంట్ రకం, నీటి కాఠిన్యం వంటి అంశాలను బట్టి సరైన మోతాదు మారుతుంది. సాధారణంగా మెషీన్‌లో సగం వరకు దుస్తులు ఉంటే సుమారు రెండు టేబుల్ స్పూన్ల డిటర్జెంట్ పౌడర్ లేదా 30–60 ఎంఎల్ లిక్విడ్ డిటర్జెంట్ సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు. దుస్తులు ఎక్కువగా మురికిగా ఉన్నప్పుడు అవసరాన్ని బట్టి మోతాదును కొద్దిగా పెంచవచ్చు. అయితే ప్యాక్‌పై తయారీదారు సూచించిన మోతాదుకు ప్రాధాన్యత ఇవ్వాలి.

దుస్తులు ఉతికిన తర్వాత కూడా డిటర్జెంట్ వాసన ఎక్కువగా వస్తుంటే.. మోతాదు ఎక్కువగా ఉన్నట్లు భావించి దాన్ని కొంత తగ్గించుకోవచ్చు. అయితే నీటి నాణ్యత, మెషీన్ మోడల్, దుస్తుల పరిమాణాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

  • హార్డ్ వాటర్ అయితే: నీటిలో ఖనిజాలు ఎక్కువగా ఉండటం వల్ల డిటర్జెంట్ పనితీరు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. అందువల్ల మెషీన్ తయారీదారు సూచించిన మోతాదును పాటించాలి.
  • టాప్‌లోడ్, ఫ్రంట్‌లోడ్ మెషీన్లు: రెండు రకాల మెషీన్లకు డిటర్జెంట్ అవసరం ఒకేలా ఉండకపోవచ్చు. ముఖ్యంగా HE (High Efficiency) మెషీన్లకు తక్కువ నురుగు వచ్చే, మెషీన్‌కు అనుకూలమైన డిటర్జెంట్‌ను ఉపయోగించాలి.
  • మెషీన్ సామర్థ్యానికి మించి బట్టలు వేయొద్దు: ఒకేసారి ఎక్కువ దుస్తులు వేస్తే అవి సరిగా కదలకపోవడంతో శుభ్రత తగ్గవచ్చు. మెషీన్‌పై అదనపు భారం పడే అవకాశం కూడా ఉంటుంది. అందుకే దుస్తులను మెషీన్ సామర్థ్యానికి అనుగుణంగా విడతలుగా ఉతకడం మంచిది.
  • మెషీన్‌ను శుభ్రంగా ఉంచాలి: డిటర్జెంట్ ట్రే, రబ్బర్ గాస్కెట్, ఫిల్టర్ వంటి భాగాల్లో పేరుకునే మురికి, అవశేషాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల దుర్వాసన, బూజు వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు.

NOTE : ఇక్కడ అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అవగాహన కోసం మాత్రమే. వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులు, చర్మ సున్నితత్వం, ఉపయోగించే డిటర్జెంట్ రకం వంటి అంశాలను బట్టి ప్రభావాలు మారవచ్చు. ఏవైనా చర్మ సమస్యలు కొనసాగితే వైద్య నిపుణులను సంప్రదించండి. వాషింగ్ మెషీన్‌ విషయంలో తయారీదారు సూచించిన డిటర్జెంట్ మోతాదు, వినియోగ విధానాన్నే అనుసరించడం మంచిది.